Updated : 24 May 2022 16:17 IST

Punjab Politics: అవినీతి ఆరోపణలు.. సీఎం ఆదేశంతో మంత్రి అరెస్టు!

(మంత్రి విజయ్‌ సింగ్లా- ఫైల్‌ ఫొటో)

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయ్‌ సింగ్లాను తాజాగా మంత్రివర్గం నుంచి తొలగించారు. మంత్రిపై ఆరోపణలు రావడం.. అందుకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలు కూడా లభించడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా సింగ్లాపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ.. వెంటనే మంత్రిని అరెస్టు చేసింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే అవినీతి ఆరోపణలపై మంత్రి సింగ్లా అరెస్టు కావడం గమనార్హం.

దంత వైద్యుడైన విజయ్‌ సింగ్లా.. మన్సా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి, పంజాబీ సింగర్‌ శుభ్‌దీప్‌ సింగ్‌ సిద్ధూపై విజయం సాధించారు. అనంతరం నూతన కేబినెట్‌లో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆ శాఖలో పరికరాల కొనుగోలుకు సంబంధించి టెండర్లు, కొనుగోళ్ల విషయంలో ఒక శాతం కమీషన్‌ డిమాండ్‌ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఆధారాలు ముఖ్యమంత్రికి చేరడంతో తీవ్రంగా పరిగణించిన ఆయన.. సింగ్లాను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఆయన్ను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. 

అవినీతిని ఉపేక్షించేది లేదు..

తమ ప్రభుత్వంలో ఒక్క శాతం అవినీతిని కూడా సహించబోమని సీఎం భగవంత్‌ మాన్‌ స్పష్టం చేశారు. మంత్రిపై ఆరోపణల నేపథ్యంలో సీఎం వీడియో సందేశం ఇచ్చారు. ‘ఓ శాఖలో టెండర్లు, పరికరాల కొనుగోలు విషయంలో ఒకశాతం కమీషన్‌ కావాలని మంత్రి డిమాండ్‌ చేశారని నాకో ఫిర్యాదు అందింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్నా. ఈ కేసు విషయం కేవలం నాకు మాత్రమే తెలుసు. మీడియాకు, ప్రతిపక్షాలకు దీనిపై సమాచారం లేదు. ఆధారాలు ఉండటంతోపాటు సింగ్లా కూడా తన తప్పులను అంగీకరించారు. దీంతో ఆయన్ను కేబినెట్‌ నుంచి తొలగించడంతోపాటు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించా’ అని పేర్కొన్నారు.

ప్రజలు ఎన్నో ఆశలతో ఆప్‌కు ఓటు వేశారని, దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలన్నారు. దేశానికి కేజ్రీవాల్ లాంటి కుమారుడు, భగవంత్ మాన్ లాంటి సైనికుడు ఉన్నంత కాలం అవినీతిపై యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ఆప్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరుడిపై ఈ స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవడం ఇది రెండోసారి. అవినీతి ఆరోపణలపై 2015లో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ కూడా తన కేబినెట్‌లో ఒకరిని తొలగించిన విషయం తెలిసిందే.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని