Cough syrup: దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

Cough syrup: దగ్గు సిరప్‌లపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇక, దగ్గు మందు ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను విదేశాలకు పంపించే ముందు ప్రభుత్వ ల్యాబ్‌ల్లో పరీక్షించి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని స్పష్టం చేసింది.

Updated : 23 May 2023 15:05 IST

దిల్లీ: భారత్‌ (India)లోని కొన్ని కంపెనీలు తయారుచేసిన దగ్గు మందుల (Cough syrup) కారణంగా కొన్ని దేశాల్లో మరణాలు సంభవించడం ఇటీవల తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఆ సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇటీవల హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దగ్గు సిరప్‌లకు ప్రభుత్వ ల్యాబ్‌ (Govt Labs)లలో అనుమతి తప్పనిసరి చేసింది. ఆ తర్వాతే ఎగుమతులు (Exports) చేసుకోవాలని స్పష్టం చేసింది. జూన్‌ 1 నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.

‘‘దగ్గు మందు (Cough syrup) ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ఏదైనా ప్రభుత్వ లాబొరేటరీలో పరీక్షించి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్‌ సమర్పిస్తేనే తమ దగ్గు మందులను ఎగుమతి చేసేందుకు అనుమతులు లభిస్తాయి. జూన్‌ 1వ తేదీ నుంచి ఈ నిబంధన తప్పనిసరి’’ అని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (DGFT) ఓ అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్‌ ఫార్మాకోపియా కమిషన్‌, రీజినల్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ (RDTL - Chandigarh), సెంట్రల్‌ డ్రగ్స్‌ ల్యాబ్‌ (CDL - Kolkata), సెంట్రల్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ (CDTL - Chennai Hyderabad, Mumbai), ఆర్‌డీటీఎల్‌ (గువాహటి)తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో దగ్గు మందుకు తనిఖీలు చేయించుకోవాలని కేంద్రం ఎగుమతుదారులకు స్పష్టం చేసింది.

భారత్‌ నుంచి ఎగమతయ్యే వివిధ రకాల ఔషధ ఉత్పత్తుల నాణ్యతపై ప్రభుత్వం రాజీ పడబోదని ఓ ఉన్నతాధికారి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందులో భాగంగానే.. ఎగుమతుల కంటే ముందే దగ్గు మందుల నాణ్యతను పరిశీలించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

2022లో గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్‌ వంటి దేశాల్లో భారత్‌లో తయారైన కలుషిత దగ్గు మందు తీసుకోవడం వల్ల పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో (WHO).. ఈ ఘటనపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో భారత ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించింది. 2022-23లో భారత్‌ 17.6 బిలియన్‌ డాలర్ల విలువైన దగ్గు సిరప్‌లను పలు దేశాలకు ఎగమతి చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని