Jaishankar: మిలిటెంట్ల టూల్‌కిట్‌లో కీలక ఆయుధంగా సోషల్‌ మీడియా..!

పాకిస్థాన్‌ ఫైనాన్షియల్ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) గ్రే లిస్ట్‌లో చేరిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు తగ్గిపోయాయని యూఎన్‌ సమావేశంలో భారత్‌ వెల్లడించింది. ఈ పరస్పర సంబంధాన్ని  కమిటీ పరిశీలించాలని కోరింది.

Updated : 29 Oct 2022 15:10 IST

దిల్లీ: మానవాళికి ఉగ్రవాద ముప్పు పెరుగుతోందని.. ఇది మరింత విస్తరిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెందిన కౌంటర్ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘సమాజాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో కుట్ర సిద్ధాంతాలను వ్యాప్తి చేయడంలో ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలు మిలిటెంట్‌ గ్రూప్‌ల టూల్‌కిట్‌లో శక్తిమంతమైన సాధనాలుగా మారాయి. కొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త సవాళ్లను విసురుతోంది. మానవాళికి ఉన్న ఉగ్రముప్పును ఎదుర్కోవడానికి యూఎన్ భద్రతామండలి తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఉగ్రవాదం విస్తృతమవుతోంది. ఆసియా, ఆఫ్రికాలో ఈ పరిస్థితి తీవ్రమవుతోంది. ఉగ్రవాద నిరోధక ఆంక్షలు రూపొందించడంలో, ఉగ్రసంస్థలకు నిధులు అందించే దేశాలను నోటీసులో ఉంచడంలో మండలి కీలకంగా వ్యవహరించింది’ అని అన్నారు. భారత్‌లో జరుగుతోన్న ఈ కౌంటర్‌ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశాల్లో ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

పాక్‌ గ్రే లిస్ట్‌లో ఉండగా దాడులు తగ్గాయి: భారత్‌

ఫైనాన్షియల్ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) గ్రే లిస్ట్‌ వల్లే జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు తగ్గిపోయాయని పాక్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ సమావేశంలో భారత్‌ వెల్లడించింది. ఈ పరస్పర సంబంధాన్ని ఈ కమిటీ పరిశీలించాలని కోరింది. ఇటీవల ‘గ్రే లిస్ట్‌’ నుంచి పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, యూరోపియన్‌ యూనియన్‌ తదితర సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం పాకిస్థాన్‌కు ఏర్పడింది. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను కట్టడిచేసే లక్ష్యాలను పాక్‌ అందుకోకపోవడం వల్ల ఎఫ్‌ఏటీఎఫ్‌ నాలుగేళ్లపాటు ఆ దేశాన్ని గ్రే లిస్ట్‌లో ఉంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని