Bypolls: మండీలో కాంగ్రెస్‌.. దాద్రానగర్‌లో శివసేన.. మధ్యప్రదేశ్‌లో భాజపా

దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం కొనసాగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ, మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా,

Updated : 02 Nov 2021 16:02 IST

3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నిక.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు 

దిల్లీ: దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం కొనసాగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ, మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా, దాద్రా నగర్‌ హవేలీ లోక్‌సభ స్థానాలకు అక్టోబరు 30న ఉప ఎన్నికల పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. వీటితో పాటు తెలంగాణలోని హుజూరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు సహా 13 రాష్ట్రాల్లోని 29 శాసనసభ స్థానాలకు కూడా పోలింగ్‌ జరిగింది. నేడు కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచే ఆయా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. 

ఈ 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో భాజపా 6, కాంగ్రెస్‌ 9 స్థానాల్లో గెలుపొందగా.. మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీలు విజయం సాధించాయి. ఇక మండీ, ఖాంద్వా, దాద్రానగర్‌ హవేలీలో సిట్టింగ్‌ ఎంపీల మరణంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. 

మండీలో కాంగ్రెస్‌.. దాద్రానగర్‌లో శివసేన

* మండీలో కాంగ్రెస్‌ తరఫున వీరభద్ర సతీమణి ప్రతిభా సింగ్‌ పోటీ చేయగా.. భాజపా నుంచి కార్గిల్‌ వీరుడు బ్రిగేడియర్‌ కుషాల్‌ సింగ్‌ బరిలోకి దిగారు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ప్రతిభా సింగ్‌ ఆధిక్యంలో ఉన్నారు.

* దాద్రా నగర్‌ హవేలీలో ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఆత్మహత్యతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో మోహన్‌ సతీమణి కలాబెన్‌ దేల్కర్‌ శివసేన అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్‌ నుంచి మహేశ్ దోదీ, భాజపా నుంచి మహేశ్‌ గవిత్‌ బరిలోకి దిగారు. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టగా.. శివసేన అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

* మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి జ్ఞానేశ్వర్‌ పాటిల్‌ ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్‌ తర్వాత తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి రాజనారాయణ్‌ సింగ్‌ పూర్ణిపై 2వేల ఓట్ల ముందంజలో కొనసాగుతున్నారు. 

* పశ్చిమ బెంగాల్‌లో నాలుగు శాసనసభ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టగా.. నాలుగింట అధికార తృణమూల్ కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. 

* అస్సాంలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో మూడు చోట్ల భాజపా ఆధిక్యంలో ఉండగా.. ఒక చోట కాంగ్రెస్‌, మరో స్థానంలో యూపీపీఎల్ ముందంజలో ఉన్నాయి.

* మధ్యప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని