Corona: చైనా టీకా.. ఆ దేశాల్లో మళ్లీ విజృంభణ!

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోన్న వేళ.. వ్యాక్సిన్లు ఆశాదీపంగా కనిపించాయి. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి.

Published : 23 Jun 2021 15:42 IST

చైనా టీకాల సామర్థ్యంపై మరోసారి చర్చ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోన్న వేళ.. వ్యాక్సిన్లు ఆశాదీపంగా కనిపించాయి. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా చైనా టీకాలపై ఆధారపడిన సీషెల్స్‌, మంగోలియా, బహ్రెయిన్‌ వంటి దేశాలు వ్యాక్సిన్ల పంపిణీని భారీ స్థాయిలో చేపట్టాయి. దీంతో త్వరలోనే కొవిడ్‌ నుంచి బయటపడతామని భావించాయి. కానీ ఆ దేశాలు ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. అక్కడ వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోగా.. మరోసారి విజృంభణ మొదలుకావడంతో తలలు పట్టుకుంటున్నాయి.

68శాతం ప్రజలకు టీకాలు వేసినా ఎందుకలా?

వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీలో చైనా చాలా ముందుంది. కరోనా వైరస్‌ ధాటికి తీవ్రంగా ప్రభావితమైన సీషెల్స్‌, చిలీ, బహ్రెయిన్‌, మంగోలియా దేశాలకు భారీ స్థాయిలో టీకాలు సరఫరా చేసింది. చైనాకు చెందిన సినోఫార్మ్‌, సినోవాక్‌ బయోటెక్‌ టీకాలపైనే ఆ దేశాలు ఆధారపడ్డాయి. వేగంగా టీకాల పంపిణీ చేపట్టిన అక్కడి ప్రభుత్వాలు.. దాదాపు 50 నుంచి 68శాతం ప్రజలకు వ్యాక్సిన్‌ అందించాయి. అనంతరం ఆ దేశాల్లో వైరస్‌ తీవ్రత తగ్గకపోగా.. కేసుల సంఖ్య గణనీయంగా పెరగసాగింది.

ఇండోనేషియాలోనూ సినోవాక్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న 350 మంది వైద్యులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వారిలో ఫిబ్రవరి-జూన్‌ మధ్యకాలంలోనే 61 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇండోనేషియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ఇలాంటి ఘటనలు సినోవాక్‌ వ్యాక్సిన్‌ పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయని సింగపూర్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ కెన్నెత్‌ మార్క్‌ అభిప్రాయపడ్డారు. చైనా వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తే పలు దేశాల్లో ఈ రకమైన తీవ్రత కనిపించేది కాదని హాంకాంగ్‌ యూనివర్సిటీకి చెందిన వైరాలజీ నిపుణులు జిన్‌ డోంగ్యాన్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితికి చైనా బాధ్యత వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా ఏవిధంగా చూసినా చైనా వ్యాక్సిన్లకు సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు రుజువవుతోందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ నికొలాయ్‌ పెట్రోవ్‌స్కి స్పష్టం చేశారు.

కొత్తరకాలపై సందేహమే..!

వ్యాక్సిన్‌ తీసుకున్నామనే ధీమాతో కొవిడ్‌ నిబంధనలు పక్కకు పెట్టడం వైరస్‌ విజృంభణకు ఒక కారణమైతే.. కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా రకాల ప్రభావం కూడా మరో కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రెండోసారి కరోనా వైరస్‌ బారినపడే  కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగోలియాలో వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ వ్యక్తి నెల తర్వాత  వైరస్‌ బారినపడడమే కాకుండా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఇలాంటి ఘటనలను ఉదహరిస్తోన్న నిపుణులు.. కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా రకాలను ఎదుర్కొనే సామర్థ్యం చైనా టీకాలకు లేకపోవచ్చంటున్నారు. అంతేకాకుండా చైనా టీకా తయారీ సంస్థలు కొత్తరకాలపై తమ వ్యాక్సిన్లు పని చేస్తున్నాయో లేదోననే విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.

పేద దేశాల చూపులు చైనాటీకా వైపే!

అమెరికాలో ఇప్పటి వరకు 45శాతం జనాభాకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందింది. అక్కడ ఎక్కువగా ఫైజర్‌, మోడెర్నా టీకాలనే తీసుకున్నారు. దీంతో గత ఆరునెలల కాలంలో కేసుల సంఖ్య 94శాతం తగ్గింది. ఇక ఇజ్రాయెల్‌లో దాదాపు ఫైజర్‌ టీకానే దేశమంతా పంపిణీ చేయగా.. అక్కడ కూడా కేసుల సంఖ్య ప్రతి పదిలక్షల జనాభాకు 4.95కు తగ్గింది. కానీ భారీ స్థాయిలో సినోఫార్మ్‌ టీకాను అందించిన సీషెల్స్‌లో మాత్రం కేసుల సంఖ్య ప్రతి పదిలక్షల జనాభాకు 716గా నమోదయింది. దాంతో చైనా వ్యాక్సిన్‌ సమర్థతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మంగోలియాలోనూ 52శాతం మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినప్పటికీ వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడడం పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ధనిక దేశాలు ఫైజర్‌, మోడెర్నా వంటి సామర్థ్యం కలిగిన వ్యాక్సిన్లను వినియోగిస్తుండగా.. పేద దేశాలు మాత్రం చైనా టీకాలవైపే చూస్తున్నాయి. దాదాపు 90దేశాలు చైనా టీకాలను సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చైనా వ్యాక్సిన్లు తగినంత ప్రభావం చూపకపోతే వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చే అవకాశాలు తక్కువని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రయోగాల సమాచారంపై గోప్యత!

కరోనాను ఎదుర్కోవడంలో ఫైజర్‌, మోడెర్నా వంటి టీకాల సామర్థ్యం 90 శాతానికిపైగా ఉండగా.. ఆస్ట్రాజెనికా, జే&జే టీకాల ప్రభావశీలత 70 శాతానికి పైగా ఉంది. అయితే చైనా సినోఫార్మ్‌ టీకా సామర్థ్యం 78శాతం అని చెబుతున్నప్పటికీ దానికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ సమాచారాన్ని బహిరంగపరచలేదు. అంతేకాక సినోవాక్‌ వ్యాక్సిన్‌ పనితీరు కేవలం 51 శాతం అని పేర్కొన్న చైనా.. వాటి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో 70శాతం మందికి వ్యాక్సిన్‌ అందిస్తే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించవచ్చని చైనా ప్రకటించింది. కానీ తాజాగా 80శాతం నుంచి 85శాతం మందికి వ్యాక్సిన్‌ అందిస్తేనే అది సాధ్యమవుతుందని చైనా సీడీసీ ప్రకటించడం గమనార్హం.

తాజా విజృంభణలకు సంబంధం లేదు

చైనా టీకాలు పంపిణీ చేస్తోన్న దేశాల్లో మళ్లీ వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో చైనా స్పందించింది. తాజా విజృంభణకు, వ్యాక్సిన్ల పనితీరుకు ఎలాంటి సంబంధం లేదని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. చైనా వ్యాక్సిన్లను అందుకున్న చాలా దేశాలు తమ టీకాలు సురక్షితమైనవని, నమ్మకమైనవని పేర్కొంటున్నాయని తెలిపింది. భవిష్యత్తులో సంభవించే కరోనా విజృంభణలను ఎదుర్కొనే స్థాయికి పలు దేశాలు ఇంకా చేరుకోలేదని, అందుచేత కొవిడ్‌ నిబంధనలను పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాన్ని చైనా గుర్తుచేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని