Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్‌ ప్రసంగం.. ప్రధాని మోదీ అభ్యంతరం

దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Updated : 01 Jul 2024 16:01 IST

దిల్లీ: దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. భారత్‌ అనే భావన, రాజ్యాంగంతోపాటు భాజపా ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాదిమందిపై గత పదేళ్లలో క్రమపద్ధతిలో దాడి జరిగిందని ఆరోపించారు. తానూ బాధితుడినేనని.. తనపై 20కిపైగా కేసులు మోపారన్నారు. ‘‘నాకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. నా ఇల్లు తీసేసుకున్నారు. ఈడీ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నా’’ అని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్ ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందని పేర్కొంటూ.. అధికారంలో కంటే ఇదే ఎక్కువ విలువైనదని, ఇందులో ‘సత్యం’ ఉందని తెలిపారు. అయితే కాంగ్రెస్‌ ఎంపీ మాట్లాడుతుండగా ప్రధాని సహా భాజపా ఎంపీలు పదే పదే అభ్యంతరం తెలపడం గమనార్హం.

అధికార పక్షం తీవ్ర అభ్యంతరం..

ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపాపై విమర్శలు గుప్పించిన రాహుల్‌ గాంధీ.. సభలో కొన్ని మతపరమైన ఫొటోలను చూపించారు. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్‌ ఓం బిర్లా వారించారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలగజేసుకుని రాహుల్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా రాహుల్‌ పేర్కొనడం ఆమోదనీయం కాదని దుయ్యబట్టారు. అటు కేంద్ర మంత్రి అమిత్‌ షా సైతం విపక్ష నేత క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారికి.. అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అయితే.. తాను భాజపాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానని.. ఆ పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్‌ తెలిపారు. అన్ని మతాలు ధైర్యం, నిర్భయత, అహింస సందేశాలను చాటి చెబుతున్నాయన్నారు.

‘నీట్‌’ను కమర్షియల్‌గా మార్చేశారు

‘‘రాష్ట్రపతి ప్రసంగంలో నీట్‌, అగ్నివీర్‌ల ప్రస్తావన లేదు. ప్రొఫెషనల్‌ పరీక్ష అయిన ‘నీట్‌’ను కమర్షియల్‌గా మార్చారు. గతంలో తీసుకొచ్చిన రైతు చట్టాల వల్ల 700 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. వారికి సంతాపంగా సభలో మౌనం కూడా పాటించలేదు. భాజపా హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి. దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా ప్రధాని చెప్పారు. భాజపా ప్రభుత్వం.. జమ్మూకశ్మీర్‌ను రెండు ముక్కలు చేసింది. అల్లర్లతో మణిపుర్‌ అట్టుడికిపోయినా.. ఇప్పటివరకు ప్రధాని వెళ్లలేదు. అక్కడ నా కళ్లముందే పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిసింది. నోట్ల రద్దు వల్ల యువత ఉపాధి కోల్పోయింది. జీఎస్టీ వల్ల వ్యాపారులు, ప్రజలు అనేక బాధలు పడ్డారు. వీటి వల్ల దేశప్రజలకు కలిగిన లాభం ఏంటి?’’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని