షాకింగ్‌.. కులాంతర వివాహం చేసుకున్నారని ₹6లక్షల జరిమానా, గ్రామ బహిష్కరణ!

కులాంతర వివాహం చేసుకున్న జంటకు గ్రామ పెద్దలు రూ.6లక్షల జరిమానా విధించారు. ఇరు కుటుంబాలను ఒప్పించే వీరు పెళ్లి చేసుకున్నప్పటికీ గ్రామ పెద్దలు భారీ జరిమానాతో పాటు వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

Updated : 05 Mar 2023 22:31 IST

చామరాజనగర్‌: కులాంతర వివాహాలు(Inter caste marriages) చేసుకున్న జంటలకు ప్రభుత్వాలు ఓ వైపు ప్రోత్సాహకాలు ఇస్తుంటే.. ఇంకోవైపు పలు చోట్ల గ్రామ పెద్దలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక(Karnataka)లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చామరాజనగర్‌ జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ఓ జంటను గ్రామ పెద్దలు తమ గ్రామం నుంచి బహిష్కరించడంతో పాటు రూ.6లక్షల జరిమానా విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కునగల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు వేరే కులం అమ్మాయిని ప్రేమించి కుటుంబ పెద్దల అంగీకారంతో ఐదేళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు. అయితే, ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారని ఇటీవలే తెలియడంతో గ్రామ పెద్దలు వారిని పిలిపించి అమానుషంగా వ్యవహరించారు. దీంతో ఈ అవమానాన్ని తట్టుకోలేని ఆ జంట మార్చి 1న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

ఉప్పర శెట్టి వర్గానికి చెందిన గోవిందరాజు అనే వ్యక్తి మాండ్యాకు చెందిన శ్వేత అనే దళిత యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. దీంతో ఐదేళ్ల క్రితం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. గోవింద రాజు-శ్వేత మాలవల్లిలో స్థిరపడగా.. తరచూ కునగల్లికి వస్తుండేవారు. ఈ క్రమంలోనే గత నెలలో తమ గ్రామానికి వచ్చిన శ్వేత తన పొరుగింటి వారితో మాట్లాడుతుండగా తాను దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా వెల్లడించింది. ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారి చివరకు గ్రామ పెద్దలకు తెలియడంతో వారు ఫిబ్రవరి 23న సమావేశం ఏర్పాటు చేశారు. ఆ దంపతుల తల్లిదండ్రులను పిలిపించి రూ.3లక్షల జరిమానా విధించారు. మార్చి 1లోపు ఆ మొత్తాన్ని చెల్లించాలని హుకుం జారీ చేశారు. దీంతో గోవింద రాజు తమ గ్రామంలోని మొత్తం 12మందిపై కేసులు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్దలు జరిమానా మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించారు. రూ.6లక్షల జరిమానాతో పాటు గోవింద రాజు కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. గ్రామం నుంచి వారు కూరగాయలు, పాలు, నీరు కొనుగోలు చేయరాదని హుకుం జారీ చేశారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని