అద్దెకున్న యువతి నిర్వాకం.. వారం రోజులు సొంతింటి మెట్లపైనే దంపతులు

అద్దెకు ఉంటున్న యువతి చేసిన నిర్వాకం కారణంగా ఓ దంపతులు తమ సొంటింటి బయటే వారం రోజులు మెట్లపై గడపాల్సి వచ్చింది. ఇల్లు ఖాళీగా ఉంచడం ఎందుకని యువతికి అద్దెకిచ్చాడో యజమాని. తీరా తన

Updated : 29 Jul 2022 13:09 IST

నోయిడా: అద్దెకు ఉంటున్న యువతి చేసిన నిర్వాకం కారణంగా ఓ దంపతులు తమ సొంతింటి బయటే వారం రోజులు మెట్లపై గడపాల్సి వచ్చింది. ఇల్లు ఖాళీగా ఉంచడం ఎందుకని యువతికి అద్దెకిచ్చాడో యజమాని. తీరా తన సొంతింటికి తిరిగి రావాలనుకుంటే ఆ యువతి ఖాళీ చేసేందుకు ససేమిరా అంది. దీంతో ఆ దంపతులు ఇంటి బయటే కూర్చుని న్యాయపోరాటం చేశారు. వారి ప్రయత్నం ఫలించి ఎట్టకేలకు ఆ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు ఒప్పుకుంది. వివరాల్లోకి వెళితే..

గ్రేటర్‌ నోయిడాకు చెందిన సునీల్‌ కుమార్‌ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఈయనకు నోయిడాలోని సెక్టార్ 16బీ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో సొంత ఫ్లాట్‌ ఉంది. అయితే వృత్తిరీత్యా సునీల్‌ ముంబయిలో విధులు నిర్వహించడంతో గతేడాది జులైలో ప్రీతి అనే యువతికి అద్దెకిచ్చారు. 11 నెలల పాటు అద్దెకుండేలా ఒప్పందం చేసుకోగా.. ఈ ఏడాది జూన్‌ 10తో అగ్రిమెంట్ ముగిసింది.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మార్చిలో పదవీ విరమణ పొందిన సునీల్‌ తిరిగి తన సొంతింటికి రావాలనుకున్నారు. ఈ విషయాన్ని ఏప్రిల్‌లోనే ప్రీతికి తెలియజేశారు. అగ్రిమెంట్‌ పూర్తయ్యాక ఇల్లు ఖాళీ చేస్తే తాము తమ ఇంటికి వచ్చేస్తామని చెప్పారు. ఇందుకు ప్రీతి కూడా ఒప్పుకోవడంతో రెండు నెలల క్రితం సునీల్‌ తన భార్య రాఖీ గుప్తాతో కలిసి నోయిడాకు వచ్చేశారు. ప్రీతి ఇల్లు ఖాళీ చేస్తే అక్కడకు మారొచ్చు అనుకుని అప్పటిదాకా బంధువుల ఇంట్లో ఉన్నారు.

అయితే అగ్రిమెంట్ గడువు పూర్తయినా ప్రీతి ఇల్లు ఖాళీ చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో సునీల్‌ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇది సివిల్‌ కేసు అయినందున కోర్టుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో చేసేదేం లేక, సునీల్‌ దంపతులు న్యాయపోరాటానికి దిగారు. తమ వస్తువులతో కలిసి సొంతింటి మెట్ల మీద కూర్చున్నారు. ఈ విషయం కాస్తా స్థానిక మీడియాలో రావడంతో వైరల్‌ అవడమేగాక, స్థానిక అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారం రోజులు వారు చేసిన పోరాటానికి గురువారం ఫలితం లభించింది. అధికారులు, ఇరుగుపొరుగు జోక్యంతో అద్దెకున్న యువతి ఇల్లు ఖాళీ చేయడంతో ఎట్టకేలకు నిన్న రాత్రి వారు తమ సొంతింట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వారు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని