అతడు.. ఆమె.. ఓ గిన్నిస్‌ రికార్డు!

ఎత్తు విషయంలో అత్యంత పొట్టి వ్యక్తులు.. అత్యంత పొడుగు వ్యక్తులు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులోకి ఎక్కడం చూశాం. కానీ ఓ జంట తమ మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసం వల్ల గిన్నిస్‌ రికార్డులో చోటు సంపాదించుకుంది

Published : 25 Jun 2021 01:19 IST

(Photo: guinnessworldrecords)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎత్తు విషయంలో అత్యంత పొట్టి వ్యక్తులు.. అత్యంత పొడుగు వ్యక్తులు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులోకి ఎక్కడం చూశాం. కానీ ఓ జంట తమ మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసం వల్ల గిన్నిస్‌ రికార్డులో చోటు సంపాదించుకుంది. బ్రిటన్‌కు చెందిన జేమ్స్‌ ఎత్తు 3.7 అడుగులు(109.3 సెంటిమీటర్లు) కాగా.. అతడి భార్య క్లోవి ఎత్తు 5.4 అడుగులు(166.1 సెంటిమీటర్లు). వీరి మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసం 1.7 అడుగులు. దీంతో ప్రపంచంలో అత్యంత ఎత్తు వ్యత్యాసం ఉన్న జంటగా గిన్నిస్‌ రికార్డు దక్కింది.

జేమ్స్‌కు డయోస్ట్రోఫిక్‌ డిస్‌ప్లాసియా అనే వ్యాధి ఉంది. అరుదైన ఈ వ్యాధి సోకిన వారికి ఎముకల్లో ఎదుగుదల సరిగా లేక ఎత్తు పెరగరు. దీంతో జేమ్స్‌ ఎదుగుదల 3.7 అడుగులకే నిలిచిపోయింది. కాగా క్లోవి అందరిలాగే సాధారణమైన యువతి. వీరిద్దరూ 2012లో తొలిసారి కలుసుకున్నారు. మనసులు కూడా కలవడంతో 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అలా ప్రేమకు ఆస్తి.. అంతస్తు.. అందం.. ఎత్తుతో కూడా పనిలేదని ఈ జంట నిరూపించింది. తాను ఎప్పుడూ పొడుగ్గా ఉండే వ్యక్తులనే ఇష్టపడేదాన్నని, కానీ జేమ్స్‌ను కలిశాక తన అభిప్రాయం మారిపోయిందని క్లోవి చెప్పుకొచ్చారు. ప్రేమలో పడ్డ కొత్తలో తమను చూసినవాళ్లు ఏం అనుకుంటారోననే భయం ఉండేదని, ఆ తర్వాత ఆ భయాన్ని పక్కన పెట్టేసి వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ జంటకు రెండేళ్ల కుమార్తె ఉంది. ఇటీవల వీరిద్దరి మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసం గురించి గిన్నిస్‌ బుక్‌ సంస్థకు తెలిసింది. దీంతో జేమ్స్‌-క్లోవి జంటను పరిశీలించి రికార్డు సాధించినట్లు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని