Sandeshkhali: ఓ ప్రైవేటు వ్యక్తి కోసం రాష్ట్రానికి ఎందుకంత ఆసక్తి? - సుప్రీం

సందేశ్‌కాలీ ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను భారత సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.

Published : 08 Jul 2024 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందేశ్‌ఖాలీలో చోటుచేసుకున్న అరాచకాలు, భూకబ్జాల ఆరోపణలపై సీబీఐ విచారణ చేయాలంటూ కలకత్తా హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను భారత సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేయడంపై మండిపడిన న్యాయస్థానం.. సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తుందని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఓ వ్యక్తిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపుతుందని ఈసందర్భంగా ప్రశ్నించింది.

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై అరాచకాలు, భూకబ్జాల ఆరోపణలపై షాజహాన్‌ షేక్‌ సహా అతడి అనుచరులపై దాదాపు 43 కేసులు నమోదయ్యాయి. దీనిపై ఇటీవల పెద్దఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం చాలా క్లిష్టమైందని, నిష్పక్షపాత దర్యాప్తు అవసరమని పేర్కొంటూ సీబీఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు ఆదేశించింది. దీనిని బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.    ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం.. ‘‘ఓ ప్రైవేటు వ్యక్తిని రక్షించడానికి రాష్ట్రానికి ఎందుకంత ఆసక్తి?’’ అని ప్రశ్నించింది. అన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా, నెలలతరబడి ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది.

నెలసరి సెలవులు మంచిదే కానీ..: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పిటిషనర్‌గా ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు బదులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాలు పోలీసు బలగాలతో సహా రాష్ట్ర యంత్రాంగం నిరుత్సాహపరిచేలా ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ పరిగణనలోకి తీసుకోని ఉన్నత న్యాయస్థానం.. సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది. అయితే, న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు సీబీఐ దర్యాప్తుపై ఎటువంటి ప్రభావం చూపవని సుప్రీం ధర్మాసనం స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని