Covaxin Booster: ఒమిక్రాన్‌పై 90%ప్రభావశీలంగాకొవాగ్జిన్‌!

ఆందోళనకర వేరియంట్‌ ఒమిక్రాన్‌పై కొవాగ్జిన్‌ టీకా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

Published : 13 Jan 2022 01:27 IST

భారత్‌ బయోటెక్‌ వెల్లడి

దిల్లీ: ఆందోళనకర వేరియంట్‌ ఒమిక్రాన్‌పై కొవాగ్జిన్‌ బూస్టర్‌ టీకా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. డెల్టాతో పాటు ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు బూస్టర్‌ డోసుతో గణనీయంగా ఉత్పత్తి అవుతున్నాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌పై 100శాతం సామర్థ్యం చూపించగా.. ఒమిక్రాన్‌పై 90శాతం ప్రభావశీలత చూపించినట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు పనితీరును పరీక్షించేందుకు అమెరికాలోని ఆక్యూజెన్‌ సహకారంతో అక్కడి ఎమోరీ వ్యాక్సిన్‌ సెంటర్‌లో భారత్‌ బయోటెక్‌ పరిశోధన చేపట్టింది. ఇందులో భాగంగా కొవాగ్జిన్‌ బూస్టర్‌ తీసుకున్న వారి రక్తాన్ని ఒమిక్రాన్‌ సోకిన వారి రక్త నమూనాలతో పరిశోధకులు పోల్చి చూశారు. కొవాగ్జిన్‌ రెండో డోసు తీసుకున్న 6 నెలలు పూర్తైన వారికి బూస్టర్‌ డోసు (మూడో డోసు) ఇచ్చి పరీక్షించారు. తద్వారా కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు తీసుకున్న 90శాతం మందిలో ఒమిక్రాన్‌ను (క్రియాశీల వైరస్‌ను) తటస్థీకరించే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు. మూడో డోసు తర్వాత ఒకే వర్గానికి చెందిన వైరస్‌లతో పాటు భిన్న వేరియంట్లను తటస్థీకరించే యాంటీబాడీల స్థాయిలు 19 నుంచి 265 రెట్లు పెరిగినట్లు కనుగొన్నారు. యావత్‌ ప్రపంచాన్ని ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలవరపెడుతోన్న వేళ వ్యాధి తీవ్రత, ఆస్పత్రి చేరిక తగ్గించే సామర్థ్యం బూస్టర్‌ డోసుకు ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడిస్తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఎమోరీ వ్యాక్సిన్‌ సెంటర్‌ నిపుణుడు మెహుల్‌ సుథార్‌ పేర్కొన్నారు.

అంతేకాకుండా ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారంగా తయారు చేసిన వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసులు ఒమిక్రాన్‌పై చూపించిన సమర్థతతో కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు ఫలితాలను పోల్చవచ్చని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. వీటికి సంబంధించిన అధ్యయనాన్ని విశ్లేషణ కోసం త్వరలోనే అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఇక కొవాగ్జిన్‌ మూడో డోసు తీసుకోవడం సురక్షితమే కాకుండా వైరస్‌ను ఎదుర్కోనే రోగనిరోధక శక్తిని పెంచుతున్నట్లు తమ విశ్లేషణలో తేలిందని ఇటీవలే పేర్కొంది. డెల్టాతోపాటు ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన రోగనిరోధక స్పందనలను తమ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తోందని వేసిన అంచనాలను తాజా అధ్యయనం ధ్రువీకరిస్తోందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని