Covaxin: కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి WHO అనుమతి

కరోనా మహమ్మారిపై పోరాడేందుకు దేశీయ ఫార్మా కంపెనీ భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అనుమతి లభించింది.

Updated : 04 Nov 2021 17:37 IST

జెనీవా: కరోనా మహమ్మారిపై పోరాడేందుకు దేశీయ ఫార్మా కంపెనీ భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అనుమతి లభించింది. ఈ టీకాను అత్యవసర వినియోగ జాబితాలో (ఎమర్జెన్సీ యూజ్‌ ఆఫ్‌ లిస్టింగ్‌-ఈయూఎల్‌) చేర్చేందుకు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం డబ్ల్యూహెచ్‌వో ట్వీట్‌ చేసింది. ఈ గుర్తింపు వల్ల ఈ టీకాను ప్రపంచ దేశాలకు అందించే వీలు కలుగుతుంది. అలానే ఈ టీకాను తీసుకున్న ఇక్కడి పౌరులు విదేశాలకు వెళ్లినప్పుడు ఎలాంటి ఆంక్షలు గానీ, స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం గానీ ఉండదు.

అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు భారత్‌ బయోటెక్‌ తొలిసారి ఏప్రిల్‌ 19న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించింది. దీనిపై పలుమార్లు నిపుణుల కమిటీ భేటీ అయ్యింది. కొవాగ్జిన్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత తదితర అంశాలపై డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక సలహా బృందం సమీక్ష నిర్వహించింది. అనంతరం ఈయూఎల్‌లో చేర్చేందుకు అనుమతిచ్చింది. ఇప్పటికే భారత్‌లో కొవాగ్జిన్‌ టీకాను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. రెండు డోసుల్లో తీసుకునే ఈ టీకా కరోనాతో పాటు పలు వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

కరోనా మహమ్మారి నియంత్రణలో వ్యాక్సిన్‌ తయారీకి ముందు నుంచీ భారత్‌ బయోటెక్‌ సంస్థ చొరవ చూపుతూ వచ్చింది. ప్రపంచానికి పెను సవాల్‌గా మారిన ఈ వైరస్‌కు విరుగుడును దిగుమతి చేసుకోవడం కాకుండా భారత్‌లోనే తయారుచేయాలని సంకల్పించుకుంది. ప్రమాణాల విషయంలో రాజీపడకుండా వేగంగా పరీక్షలు నిర్వహిస్తూ కొవాగ్జిన్‌ను తయారుచేసింది. బీఎస్‌ఎల్‌-3 ల్యాబ్‌ సౌకర్యం ఉండటం, గతంలోనూ పలు మహమ్మారులకు టీకాలు తయారుచేసే అనుభవంతో కొవాగ్జిన్‌ను రూపొందించింది. మన దేశంలో విస్తృతంగా వినియోగంలో ఉన్న కొవాగ్జిన్‌ కరోనా వైరస్‌ నుంచి 77.8శాతం రక్షణ కల్పిస్తుండగా.. డెల్టా వేరియంట్‌ నుంచి 65.2శాతం మేర రక్షణ కల్పిస్తున్నట్టు పలు పరిశోధనల్లో తేలిన విషయం తెలిసిందే.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని