UK Covid: యూకేలో ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాకం.. 43 వేల మందికి తప్పుడు కొవిడ్‌ ఫలితాలు!

యూకేలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో ఆయా సమస్యల కారణంగా అందులో కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్న దాదాపు 43 వేల మందికి తప్పుడు నెగెటివ్‌ ఫలితాలు వచ్చినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి వోల్వర్‌హాంప్టన్‌లో...

Published : 15 Oct 2021 18:54 IST

లండన్‌: యూకేలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో ఆయా సమస్యల కారణంగా అందులో కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్న దాదాపు 43 వేల మందికి తప్పుడు నెగెటివ్‌ ఫలితాలు వచ్చినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి వోల్వర్‌ హాంప్టన్‌లో ఉన్న ఆ ల్యాబ్‌లో ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలను నిలిపివేసినట్లు యూకే ఆరోగ్య భద్రతా సంస్థ(యూకేహెచ్‌ఎస్‌ఏ) శుక్రవారం ప్రకటించింది. ‘ఆ ల్యాబ్‌లో దాదాపు నాలుగు లక్షల నమూనాలు పరీక్షించారు. అందులో చాలావరకూ నెగెటివ్‌ వచ్చాయి. కానీ, వాటిలో 43 వేల వరకు తప్పుడు నెగెటివ్‌ ఫలితాలు ఉండవచ్చు. సెప్టెంబర్ 8 నుంచి అక్టోబర్ 12 మధ్య ఈ రిజల్ట్స్‌ వచ్చాయి’ అని పేర్కొంది.

‘మరోసారి టెస్టులు చేయించుకోండి’

సదరు ల్యాబ్‌లో ఆర్టీ- పీసీఆర్‌ పరీక్ష చేయించుకుని నెగెటివ్‌ వచ్చినవారు.. మళ్లీ బయట టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్‌ వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్‌) దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఈ విషయం బయటపడింది. దీంతో సదరు వ్యక్తులు మరోసారి టెస్ట్‌ చేయించుకోవాలని సూచించింది. మరోవైపు అధికారులు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ల్యాబ్‌ను నిర్వహిస్తున్న ‘ఇమ్మెన్సా హెల్త్ క్లినిక్’ వెల్లడించింది. ఈ వ్యవహారంపై యూకేహెచ్‌ఎస్‌ఏలోని పబ్లిక్ హెల్త్ ఇన్సిడెంట్ డైరెక్టర్ డాక్టర్ విల్ వెల్ఫేర్ మాట్లాడుతూ.. ఆర్టీ- పీసీఆర్‌, ఎల్‌ఎఫ్‌డీ టెస్ట్ కిట్‌లలో ఎలాంటి లోపాలు లేవని, సదరు పరీక్షలు నిర్వహిస్తున్న ఇతర ల్యాబ్‌ల సేవలను నిస్సందేహంగా ఉపయోగించుకోవచ్చని పౌరులకు వివరించారు.

రోజుకు పది లక్షల మందికి..

దేశవ్యాప్తంగా ఆయా పరీక్షా కేంద్రాల్లోనూ ఈ తరహా సమస్యలు తలెత్తినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్ అండ్ సోషల్ కేర్(డీహెచ్‌ఎస్‌సీ) వెల్లడించింది. ఇదే క్రమంలో ఇంగ్లాండ్‌లోని స్థానిక అధికార సంస్థ ‘వెస్ట్ బెర్క్‌షైర్ కౌన్సిల్’ సైతం అక్టోబర్ 3- 12 మధ్య ప్రభుత్వ ఆధ్వర్యంలో న్యూబరీ షోగ్రౌండ్ సైట్‌లో కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్న నివాసితులు మరోసారి టెస్టులు చేయించుకోవాలని సూచించడం గమనార్హం. తప్పుడు నెగెటివ్‌ ఫలితాలు వచ్చినందునే ఈ సూచన వెలువరించినట్లు పేర్కొంది. మరోవైపు ఈ తప్పుడు ఫలితాల విషయంలో పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూకేలో ప్రస్తుతం రోజుకు 10 లక్షల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని