Eta variant: భారత్‌లో తొలి ‘ఈటా’ వేరియంట్‌ కేసు

కరోనా వైరస్​ జన్యు క్రమాన్ని మార్చుకుంటూ పంజా విసురుతోంది. రోజుకో రూపాన్ని ధరిస్తూ విస్తరిస్తోంది. బ్రిటన్​లో తొలిసారి గుర్తించిన ‘ఈటా వేరియంట్​’ భారత్​కు పాకింది....

Published : 06 Aug 2021 18:30 IST

మంగళూరు: కరోనా వైరస్​ జన్యు క్రమాన్ని మార్చుకుంటూ పంజా విసురుతోంది. రోజుకో రూపాన్ని ధరిస్తూ విస్తరిస్తోంది. బ్రిటన్​లో తొలిసారి గుర్తించిన ‘ఈటా వేరియంట్​’ భారత్​కూ పాకింది. కర్ణాటక మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈ కొత్త రకాన్ని గుర్తించినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడు నాలుగు నెలల క్రితం దుబాయ్​ నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షలు నిర్వహించగా.. అతడికి కరోనా పాజిటివ్​గా తేలిందని, కొద్ది రోజుల తర్వాత కోలుకున్నట్లు పేర్కొన్నారు. బాధితుడితో సన్నిహితంగా ఉన్న దాదాపు 100 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. వైరస్​ జన్యు క్రమంపై పరిశోధన చేసేందుకు నమూనాలను పరిశోధన కేంద్రానికి పంపగా.. ఆ వ్యక్తిలో ఈ కొత్త రకం బయటపడినట్లు వివరించారు.

ఈటా వేరియంట్‌ను గతేడాది డిసెంబర్‌లో బ్రిటన్‌తోపాటు నైజీరియాలో గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న బ్రిటన్‌లో 56 కేసులు వెలుగుచూశాయి. డెన్మార్క్‌లోనూ పలు కేసులు బయటపడ్డాయి. ఫిబ్రవరిలో ఈ వేరియంట్‌ నైజీరియాలో విస్తృతంగా వ్యాపించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మార్చి 5 వరకు ఈటా 23 దేశాలకు పాకింది. కాగా ఈ వేరియంట్‌ తీవ్రతను తెలుసుకునేందుకు యూకేలో ప్రస్తుతం అధ్యయనాలు కొనసాగుతున్నాయి. కాగా దీనిని ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని