Corona: ‘కొవిడ్‌ పరిస్థితి అదుపులోనే ఉంది.. ఆందోళన అవసరంలేదు’

కరోనా వైరస్‌ వ్యాప్తి మరోసారి ఉద్దృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ......

Published : 21 Apr 2022 01:54 IST

ముంబయి: కరోనా వైరస్‌ వ్యాప్తి మరోసారి ఉద్దృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే స్పందించారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితి నియంత్రణలోనే ఉందనీ.. భయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో మరోసారి కేసులు పెరుగుతున్న వేళ  కేంద్ర ప్రభుత్వం నిన్న దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, మహారాష్ట్ర, మిజోరం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. కరోనా నియంత్రణకు కఠినంగా వ్యవహరించాలనీ, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో మంత్రి తోపే ముంబయిలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందన్నారు. పరిస్థితిని బట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో మాస్క్‌ తప్పనిసరి నిబంధనలు సడలించినప్పటికీ వయో వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారు మాత్రం బయటకు వచ్చినప్పుడు ముందు జాగ్రత్తతో మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో నిన్న 137 కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 78,76,041కి చేరింది.

‘‘నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 137 కేసులు వచ్చాయి. వీటిలో ముంబయిలో నగరంలో 85 నమోదయ్యాయి. గతంలో రోజుకు 60వేల వరకూ కేసుల్ని మనం చూశాం. అందువల్ల ప్రస్తుతం కొవిడ్ పరిస్థితి రాష్ట్రంలో నియంత్రణలోనే ఉంది. భయపడాల్సిన అవసరంలేదు. వ్యాక్సినేషన్‌ కవరేజీ కూడా బాగానే ఉంది. యూరప్‌, చైనాలాంటి దేశాలతో పాటు దిల్లీలోనూ కొంత మేరకు కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌, మహారాష్ట్ర ఆరోగ్యశాఖ, మా టాస్క్‌ఫోర్సు నిఘా ఉంచాయి. పరిస్థితిని బట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం’’ అని మంత్రి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని