కరోనాతో.. 2కోట్ల ఏళ్ల జీవిత కాలం నష్టం!

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19తో ప్రాణాలు కోల్పోయిన వారివల్ల దాదాపు 2కోట్ల ఏళ్ల జీవిత కాలాన్ని నష్టం సంభవించిందని తాజా అధ్యయనం అంచనా వేసింది.

Published : 24 Feb 2021 09:32 IST

అంతర్జాతీయ నిపుణుల అధ్యయనం

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 25లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టంతో పాటు యావత్‌ దేశాలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19తో ప్రాణాలు కోల్పోయిన వారివల్ల దాదాపు 2కోట్ల ఏళ్ల జీవిత కాలాన్ని నష్టం సంభవించిందని తాజా అధ్యయనం అంచనా వేసింది. పలు అంతర్జాతీయ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయన నివేదిక సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

కరోనా వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారివల్ల కలిగే నష్టాన్ని అంచనా వేసేందుకు భారత్‌తోపాటు 81 దేశాలకు చెందిన కొన్ని నెలల కొవిడ్‌ మరణాల సమాచారాన్ని విశ్లేషించారు. కొవిడ్‌-19 వల్ల చనిపోయే నాటికి వ్యక్తి వయస్సు, వారి జీవితకాలం మధ్య తేడాను ఇయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌ లాస్ట్‌(YLL) గా పరిగణలోకి తీసుకున్నారు. కొవిడ్‌ సోకి ప్రాణాలు కోల్పోయే వ్యక్తి సరాసరి ఆయుర్దాయం 16ఏళ్లుగా లెక్కగట్టారు. ఇలా ఇప్పటివరకు కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారివల్ల 2,05,07,518 సంవత్సరాల జీవితకాలాన్ని కోల్పోయినట్లు అంచనా వేశారు. జనవరి 6వ తేదీ నాటికి, సాధారణ ఫ్లూ వల్ల సంభవించే సరాసరి వైఎల్‌ఎల్‌ కంటే కొవిడ్‌ వల్ల సంభవిస్తోన్న వైఎల్‌ఎల్‌ రెండు నుంచి తొమ్మిది రెట్లు ఎక్కువ ఉన్నట్లు అంచనా వేశారు. అంతేకాకుండా హృద్రోగ వ్యాధుల వల్ల కలిగే YLL కంటే ఈ నష్టం 25 నుంచి 50 శాతం ఎక్కువని పేర్కొన్నారు.

కొవిడ్‌ మరణాల వల్ల నష్టపోయిన మొత్తం జీవిత కాలం నష్టంలో (YLL) 44.9శాతం 55నుంచి 75ఏళ్ల వయసున్న వారివల్లేనని ఈ అధ్యయనం పేర్కొంది. 55ఏళ్లలోపు వయసున్న వారి వల్ల 30.2శాతం, 75ఏళ్లపైనున్న వారి వల్ల 25శాతం YLL కోల్పోయనట్లు తాజా అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా కొవిడ్‌ మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో దాదాపు 44శాతం పురుషుల జీవన కాల నష్టమే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఈ అధ్యయనంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనిర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌-మాడిసన్‌, జర్మనీకి చెందిన మాక్స్‌ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి అంతర్జాతీయ యూనివర్సిటీల పరిశోధకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని