Corona: దిల్లీలో ఆస్పత్రుల్లో చేరికలు 60% పెరిగాయ్‌..!

దేశ రాజధాని నగరం దిల్లీలో కరోనా వైరస్‌ (Corona virus) మరోసారి కలకలం రేపుతోంది. ఆగస్టు 1 నుంచి ఈ మహమ్మారి......

Published : 17 Aug 2022 19:22 IST

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో కరోనా వైరస్‌ (Corona virus) మరోసారి కలకలం రేపుతోంది. ఆగస్టు 1 నుంచి ఈ మహమ్మారి బారిన పడినవారిలో 60శాతం మంది ఆస్పత్రిలో చేరినట్టు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఓ వైపు కొవిడ్‌ కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. ఆస్పత్రుల్లో చేరికలు మాత్రం పెరుగుతుండటం కలవరపెట్టే అంశం. ప్రస్తుతం దిల్లీలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 19.20శాతంగా ఉండగా.. ఇది 200 రోజులకన్నా అధికం. అయితే,  కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారిలో 90శాతం మంది బూస్డర్‌ డోసు తీసుకోలేదని ప్రభుత్వం చెబుతోంది. దిల్లీలో నిన్న 900లకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా వారిలో అత్యధిక మంది ఆస్పత్రుల్లో చేరడం గమనార్హం. 

కొన్ని రోజులతో పోల్చి చూస్తే..

ఆగస్టు 2న దిల్లీలో 1,506 కరోనా కేసులు నమోదు కాగా.. వీరిలో 341మంది ఆస్పత్రుల్లో చేరారు. మరో 105మంది ఐసీయూలో చికిత్సపొందగా.. మూడు మరణాలు నమోదయ్యాయి. అలాగే, ఆగస్టు 9న 2,495 కేసులు, ఏడు మరణాలు సంభవించగా.. వీరిలో 507మంది ఆస్పత్రిలో చేరారు. మరో 168మంది కరోనా సంబంధిత లక్షణాలతో ఐసీయూలో చేరి చికిత్సపొందారు. కానీ, మంగళవారం (ఆగస్టు 16న) మాత్రం దిల్లీలో 917 కేసులు మాత్రమే వచ్చినప్పటికీ ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 563గా ఉంది. అలాగే, 202మంది ఐసీయూలో చేరగా.. మూడు మరణాలు నమోదయ్యాయి. 

దిల్లీ నగరంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ మాస్కులు ధరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. ‘కొవిడ్‌ వ్యాప్తిని చూస్తున్నాం. అధిక కేసులు, పాజిటివిటీ రేటు నమోదవుతోంది. మహమ్మారి ఇంకా కొనసాగనుందనే విషయాన్ని మనం గ్రహించాలి. కరోనా నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలి’ అని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా విజ్ఞప్తి చేశారు.  అయితే, దిల్లీలో రికవరీ రేటు బాగానే ఉన్నప్పటికీ.. కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు, ఆస్పత్రిలో చేరినవారి సంఖ్య పెరగడంపట్ల పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరమేమీ లేదని.. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని