Corona Virus: జర్మనీలో మళ్లీ కరోనా కల్లోలం.. కొత్త కేసుల ఆల్‌టైం రికార్డు!

జర్మనీలో కరోనా మహమ్మారి మళ్లీ కల్లోలం రేపుతోంది. కరోనా వ్యాప్తి మొదలైనప్పట్నుంచి గతంలో ఎన్నడూ రానన్ని కొత్త కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది.......

Updated : 05 Nov 2021 11:34 IST

బెర్లిన్‌: జర్మనీలో కరోనా మహమ్మారి మళ్లీ కల్లోలం రేపుతోంది. కరోనా వ్యాప్తి మొదలైనప్పట్నుంచి గతంలో ఎన్నడూ రానన్ని కొత్త కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలోనే జర్మనీలో 33,949 కొత్త కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌ 18న అత్యధికంగా 33,777 కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్యను మించిపోయాయి. ఇంత భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడంతో జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్‌ స్పాన్‌ 16 రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో సమావేశమయ్యారు. చలికాలంలో కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణకు చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు ఆస్పత్రుల్లో ఐసీయూలు నిండిపోవడం మళ్లీ ప్రారంభం కావడం, పిల్లల్లో ఇన్ఫెక్షన్లు పెరిగిపోతుండటం వంటి కీలక అంశాలపై చర్చించారు. మరోవైపు, గురువారం ఒక్కరోజే 165 మరణాలు నమోదయ్యాయి. జర్మనీలో ఇప్పటివరకు 46.62లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వీరిలో 96 వేల మందికి పైగా మృతిచెందారు. 43.28లక్షల మందికి పైగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2.3లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయి. 

జర్మనీలో ఇంకా టీకాలు వేసుకోని వారంతా తీసుకోవాలని సీనియర్‌ వైద్య అధికారులు అక్కడి పౌరులకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం..  జర్మనీలో 83 మిలియన్ల జనాభాలో మూడింట రెండొంతుల మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ తొలి రౌండ్‌ పూర్తయింది. దాదాపు 16.2 మిలియన్ల జనాభాకు (12 ఏళ్లు పైబడిన వారందరికీ) ఇంకా వ్యాక్సినేషన్‌ పూర్తి కావాల్సి ఉంది. వీరిలో 3.2మిలియన్ల మంది 60ఏళ్లు పైబడినవారే ఉండటం గమనార్హం.  మరోవైపు, దేశంలో బూస్టర్‌ డోసు అందుబాటులోకి తేవాలని ఆగస్టులోనే అధికారులు అంగీకరించారు. అయితే, 60 ఏళ్లు పైబడినవారికి, నర్సింగ్‌ హోమ్‌ రెసిడెంట్స్‌, సిబ్బందికి బూస్టర్‌ డోసు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకు కేవలం 2 మిలియన్ల మందికి మాత్రమే పూర్తి చేశారు.

ఇటీవల కొన్ని సీనియర్‌ సిటిజన్‌ హోమ్‌లలో కొవిడ్‌ వ్యాప్తి పెరగడం, డజన్ల మంది చనిపోవడంతో నర్సింగ్‌ హోమ్‌లలో కొవిడ్‌ పరీక్షలు చేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది. నర్సింగ్‌ హోమ్‌లు, ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేయాలని కుటుంబ వైద్యుల అసోసియేషన్‌ చీఫ్‌ ఉల్‌రిచ్‌ వెగెల్డ్‌ డిమాండ్‌ చేశారు. టీకా తీసుకోని వ్యక్తులెవరూ కొవిడ్‌ బారిన పడే అవకాశం ఉండే వ్యక్తులను కలవరాదన్నారు. ఇది సీనియర్‌ సిటిజన్‌ హోమ్‌లు, నర్సింగ్‌ హోమ్‌లో, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లకు కూడా వర్తింపజేయాలన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని