Covid Cases: ‘ఆస్పత్రుల్లో చేరికలు తక్కువే.. భయపడాల్సిన అవసరం లేదు’

దిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నా.. భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్థానికులకు అభయం ఇచ్చారు. దేశ రాజధానిలో కొన్ని రోజులుగా భారీ ఎత్తున కేసులు బయటపడుతున్న నేపథ్యంలో.. ఆదివారం కేజ్రీవాల్‌ ప్రసంగించారు. ‘ప్రస్తుతం...

Published : 02 Jan 2022 16:10 IST

దిల్లీలో కరోనా పరిస్థితులపై సీఎం కేజ్రీవాల్‌

దిల్లీ: దిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నా.. భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. దేశ రాజధానిలో కొన్ని రోజులుగా భారీ ఎత్తున కేసులు బయటపడుతున్న నేపథ్యంలో.. ఆదివారం కేజ్రీవాల్‌ ప్రసంగించారు. ‘ప్రస్తుతం దిల్లీలో 6300కు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ రోజు మూడు వేలకుపైగా రావొచ్చు. కానీ.. శనివారం వరకు కేవలం 246 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తేలింది. బెడ్ ఆక్యుపెన్సీ రేటు కూడా ఒక శాతం కంటే తక్కువగా ఉంది. పైగా.. కొత్త కేసులన్నీ తేలికపాటివి, లక్షణాలు లేనివే. కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు. కేసుల పెరుగుదల ప్రభావం సైతం రెండో వేవ్ సమయంలో ఉన్న దానికంటే చాలా తక్కువగా ఉందని గణాంకాలు ప్రదర్శించారు.

37 వేల ప్రభుత్వ పడకలు సిద్ధం!

అయితే, యాక్టివ్ కేసుల సంఖ్య డిసెంబర్ 29న దాదాపు రెండు వేలు ఉండగా.. జనవరి ఒకటి నాటికి ఆరు వేలకు పెరిగిన నేపథ్యంలో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేజ్రీవాల్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు. మరోవైపు.. ఇదే వ్యవధిలో ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతానికి ఈ ఉద్ధృతి రెండో వేవ్‌ అంత తీవ్రంగా లేదని ఈ వివరాలు సూచిస్తున్నాయన్నారు. ప్రభుత్వం 37 వేల పడకలు సిద్ధం చేసినట్లు చెప్పారు. దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ.. ఆసుపత్రి ఆక్యుపెన్సీ తక్కువగా ఉందని, తదుపరి ఆంక్షలను త్వరలో సమీక్షిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. దిల్లీలో శనివారం 2,716 కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. మే 21 తర్వాత అత్యధిక కేసులు ఇవే. శుక్రవారంతో పోలిస్తే ఏకంగా 51 శాతం పెరుగుదల నమోదైంది. మొత్తం 351 ఒమిక్రాన్‌ కేసులు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని