Corona virus: దిల్లీ, మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతం.. రోజురోజుకీ కేసులు పైపైకి!

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. కొన్ని వారాలుగా మహారాష్ట్రలో కొత్త కేసులు భారీగా వెలుగుచూడటం కలవరపెడుతోంది.....

Updated : 10 Jun 2022 23:56 IST

ముంబయి: దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. కొన్ని వారాలుగా మహారాష్ట్ర, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది. తాజాగా మహారాష్ట్రలో 3వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 3081 కొత్త కేసులు రాగా.. 1323మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అయితే, ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. మహారాష్ట్రలో బుధవారం 2701 కేసులు రాగా.. నిన్న 2,813 కొత్త కేసులు వచ్చాయి. దాదాపు మూడు నెలల తర్వాత  ఒక్కరోజు కేసులు 3వేల మార్కును దాటడం గమనార్హం. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలుపుకొంటే మహారాష్ట్రలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 13,329కి పెరిగినట్టు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు, మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అధిక భాగం ముంబయిలోనే. నగరంలో గడిచిన 24గంటల వ్యవధిలో 15,346 టెస్టులు చేయగా.. 1956మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు బీఎంసీ అధికారులు తెలిపారు. ముంబయిలో ప్రస్తుతం 9191 క్రియాశీల కేసులు ఉండగా థానెలో 2157, పుణెలో 884, రాయిగఢ్‌లో 411 చొప్పున యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

దిల్లీలోనూ పెరిగిన కేసులు..

దిల్లీలోనూ కొవిడ్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నిన్న 622 మందికి వైరస్‌ సోకగా.. తాజాగా మరో 655 మందిలో ఈ మహమ్మారి వెలుగుచూసింది. తాజాగా 419మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. కరోనాతో పోరాడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో దిల్లీలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 19,11,268కి చేరింది. వీరిలో 18,83,042 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 26,218 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2008కి ఎగబాకింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని