Corona: 80శాతం తగ్గిన కొవిడ్‌ వ్యాప్తి.. ఆ 5 రాష్ట్రాల్లో ఇంకా ఆందోళనకరంగానే..

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమక్రమంగా అదుపులోకి వస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం

Published : 10 Feb 2022 17:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమక్రమంగా అదుపులోకి వస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, జనవరి 21 నాటి గరిష్ఠ స్థితితో పోలిస్తే కేసులు 80శాతం తగ్గాయని తెలిపింది. ఇక నాలుగు రాష్ట్రాల్లో క్రియాశీల కేసుల సంఖ్య 50వేల పైన ఉందని పేర్కొంది. దేశంలో వైరస్‌ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది. 

5శాతం దిగువకు పాజిటివిటీ రేటు..

ఈ ఏడాది జనవరి 24వ తేదీన పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 20.75శాతానికి పెరిగింది. అయితే ప్రస్తుతం అది 4.44శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దీని బట్టి చూస్తే వైరస్‌ వ్యాప్తి రేటు క్రమంగా తగ్గుతోందని అన్నారు. ఇక, జనవరి 21న కొత్త కేసులు ఏకంగా 3.47లక్షలు దాటాయి. అప్పటితో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య 80శాతం తగ్గిందని పేర్కొన్నారు. 

కేరళలో అత్యధికంగా..

కేరళలో కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. అక్కడ రోజువారీ పాజిటివిటీ రేటు అత్యధికంగా 29.57శాతంగా ఉంది. ఇక మిజోరం, హిమాచల్‌ ప్రదేశ్‌, అరుణాచల్ ప్రదేశ్‌, సిక్కింలలోనూ పాజిటివిటీ రేటు ఆందోళనకరంగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దాదాపు 40 జిల్లాల్లో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొంది. 141 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతానికి పైనే ఉండగా.. 160 జిల్లాల్లో 5 నుంచి 10శాతం మధ్యలో ఉన్నట్లు తెలిపింది. 

ఆ నాలుగు రాష్ట్రాల్లో అత్యధిక యాక్టివ్‌ కేసులు..

కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశంలో క్రియాశీల కేసులు కూడా దిగొచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7.90లక్షల మంది వైరస్‌తో బాధపడుతుండగా.. యాక్టివ్‌ కేసుల రేటు 1.86శాతానికి తగ్గింది. అయితే 4 రాష్ట్రాల్లో మాత్రం క్ర్రియాశీల కేసులు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్‌ కేసులున్నట్లు పేర్కొంది. ఇక 11 రాష్ట్రాల్లో క్రియాశీల కేసులు 10 వేల నుంచి 50వేల మధ్యలో ఉన్నట్లు తెలిపింది. 

96శాతం మందికి తొలి డోసు పూర్తి..

కరోనా వ్యాక్సినేషన్‌లో దేశంలో త్వరలోనే మరో అరుదైన మైలురాయిని అందుకోనుంది. ఇప్పటివరకు అర్హులైన వయోజనుల్లో 90.23కోట్ల మంది అంటే 96శాతం మందికి తొలి డోసు పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో ఇది 100శాతానికి చేరుకుంటుందని తెలిపింది. 78శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు పేర్కొంది. ఇక, దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ నిర్విరామంగా కొనసాగుతోంది. టీకా పంపిణీని విస్తరిస్తూ జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్లు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 14శాతం మంది (1.05కోట్ల మంది) టీనేజర్లు రెండు డోసుల టీకా తీసుకోగా.. 69శాతం మందికి తొలి డోసు అందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 1.61కోట్ల మందికి ప్రికాషనరీ డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని