ఆ దేశాల్లోనే 10రెట్లు ఎక్కువగా కొవిడ్ మరణాలు!

స్థూలకాయులు అధికంగా ఉన్న దేశాల్లోనే కొవిడ్‌ మరణాల రేటు అధికంగా ఉన్నట్లు తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

Published : 08 Mar 2021 19:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కొవిడ్‌ మహమ్మారి లక్షల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటోంది. అమెరికా, బ్రెజిల్‌తో పాటు యూరప్‌ దేశాల్లోనూ కొవిడ్‌ మరణాల రేటు అధికంగా ఉంది. స్థూలకాయులు అధికంగా ఉన్న దేశాల్లోనే కొవిడ్‌ మరణాల రేటు అధికంగా ఉన్నట్లు తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. స్థూలకాయుల శాతం అధికంగా ఉన్న దేశాల్లో కొవిడ్‌ మరణాల రేటు 10రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

కొవిడ్‌-19 సోకి మరణిస్తున్న వారిలో ఎక్కువగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, కరోనా వైరస్‌ విలయం ధాటికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 26లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో అత్యధిక మరణాలు అమెరికాలో(5లక్షల 25వేలు) చోటుచేసుకోగా, బ్రెజిల్‌లో 2.65లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మెక్సికో, భారత్, బ్రిటన్‌లలోనూ కొవిడ్‌ మరణాల సంఖ్య అధికంగానే ఉంది. వివిధ దేశాల్లో కొవిడ్‌ మరణాల రేటులో వ్యత్యాసాలను తెలుసుకునేందుకు వరల్డ్‌ ఒబేసిటీ ఫెడరేషన్‌ పరిశోధన చేపట్టింది. ఇందుకోసం 160దేశాల్లో సంభవిస్తోన్న కొవిడ్‌ మరణాల సమాచారాన్ని వరల్డ్‌ ఒబేసిటీ ఫెడరేషన్‌ విశ్లేషించింది. అనంతరం వీరిలో స్థూలకాయం ఎక్కువగా ఉన్న దేశాల్లోనే పదిరెట్లు కొవిడ్‌ మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నారు గుర్తించింది.

స్థూలకాయుల సంఖ్య 40శాతం కన్నా తక్కువగా ఉన్న దేశాల్లో తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇలాంటి దేశాల్లో ప్రతి లక్షల జనాభాలో పది కంటే తక్కువ కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. కొవిడ్‌ మరణాల రేటు అత్యంత తక్కువగా ఉన్న వియాత్నంలో స్థూలకాయుల శాతం 18.3శాతం. ఇలాగే, స్థూలకాయుల జనాభా మితంగా ఉండే జపాన్‌, థాయిలాండ్‌, దక్షిణ కొరియా దేశాల్లోనూ కొవిడ్‌ మరణాలు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అత్యధిక శాతం స్థూలకాయులున్న అమెరికాలో(67శాతం) కొవిడ్‌ మరణాల రేటు అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఇక్కడ ప్రతి లక్ష జనాభాకు 152 కొవిడ్‌ మరణాలు నమోదయినట్లు పేర్కొన్నారు.

కొవిడ్‌ మరణాలు ఎక్కువగా వయసుపైబడిన వారిలోనే అధికంగా సంభవిస్తున్నప్పటికీ, స్థూలకాయుల్లో కూడా వీటి శాతం అధికంగా ఉండటం విచారకరమని పరిశోధకులు పేర్కొన్నారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలున్న వారిపై ఆయా ప్రభుత్వాలు శ్రద్ధ చూపితే కొవిడ్‌ బారినుంచి వారిని కాపాడటం సాధ్యమేనని వరల్డ్‌ ఒబేసిటీ ఫెడరేషన్‌ సీఈఓ జోహన్నా రాల్స్‌టన్‌ స్పష్టంచేశారు. ఆరోగ్యకరమైన జనాభా వల్ల కలిగే ఆర్థిక విలువలను ప్రభుత్వాలు విస్మరించడంతో పాటు స్థూలకాయం వంటి వ్యాధుల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ టిమ్‌ లోబ్‌స్టెయిన్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని