Published : 04 Feb 2022 17:57 IST

Covid India: ఐదు లక్షలకుపైగా కరోనా మరణాలు.. ఈ మార్కుదాటిన మూడో దేశంగా భారత్‌

దిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారికి బలైనవారి సంఖ్య గురువారానికి అయిదు లక్షల మార్కును దాటింది! కొవిడ్‌ కారణంగా ఇప్పటికే అమెరికా, బ్రెజిల్‌లలో అయిదు లక్షలకుపైగా మరణాలు నమోదుకాగ.. భారత్‌ మూడో దేశంగా నిలిచింది. 2020 జనవరిలో దేశంలోకి వైరస్‌ ప్రవేశించిన విషయం తెలిసిందే. దీని కారణంగా మార్చిలో తొలి మరణం నమోదైంది. నాటి నుంచి దాదాపు రెండేళ్ల కాలంలో 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం 1,072 రోజువారీ మరణాలతో మొత్తం సంఖ్య 5,00,055కి చేరుకుంది. మొదటి లక్ష మరణాలు 2020 అక్టోబరు 2న నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్‌ 27న రెండు లక్షలకు చేరుకోగా, మే 23 నాటికే మూడు లక్షలు దాటడం.. నాటి రెండో వేవ్‌ తీవ్రతను చాటింది. అదే ఏడాది జూలై 1 నాటికి మరణాల సంఖ్య నాలుగు లక్షలకు చేరింది.

దాదాపు ఏడు నెలల వ్యవధి తర్వాత ఇప్పుడు 5 లక్షలు దాటింది. అయితే, కరోనా మొదటినుంచి చూసుకుంటే.. లక్ష మరణాల నమోదుకు పట్టిన ఎక్కువ సమయం ఇదే కావడం ఊరట కలిగించే అంశం! ఒక్క మహారాష్ట్రలోనే 1,42,859 మంది చనిపోగా.. తర్వాతి స్థానంలో కేరళ(56,701) ఉంది. ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు పరిశీలిస్తే.. అమెరికాలో 8.96 లక్షలకుపైగా మరణాలు సంభవించాయి. 6.3 లక్షలతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా.. భారత్‌లో ప్రస్తుతం ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సినేషన్‌ కారణంగా మూడో వేవ్‌ తీవ్రత తక్కువగా ఉన్నట్లు కేంద్రం అంచనా వేసింది. మరోవైపు.. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కూడా క్రమంగా అదుపులోకి వస్తోంది. కొద్ది రోజులుగా రెండు లక్షల దిగువనే కేసులు నమోదవుతున్నాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts