Covid Origin: కరోనా.. చైనా శాస్త్రవేత్తల సృష్టే?

కరోనా వైరస్‌ చైనా శాస్త్రవేత్తల సృష్టే అని తాజాగా బ్రిటన్‌, నార్వేకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Published : 30 May 2021 18:50 IST

బ్రిటన్‌, నార్వే శాస్త్రవేత్తల తాజా అధ్యయనం

లండన్‌: ఏడాదిన్నర కావస్తున్నా.. యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి మూలాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. వీటిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. అందరి వేళ్లు మరోసారి వుహాన్‌ ల్యాబ్‌వైపే చూపిస్తున్నాయి. కరోనా వైరస్‌ చైనా శాస్త్రవేత్తల సృష్టే అని తాజాగా బ్రిటన్‌, నార్వేకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాకుండా అది గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు కనిపించేలా రివర్స్‌ ఇంజినీరింగ్‌కు ప్రయత్నించినట్లు స్పష్టం చేశారు. ఈ కథనం బ్రిటన్‌కు చెందిన ‘డైలీ మెయిల్‌’లో ప్రచురితం కాగా.. పూర్తి నివేదిక మరికొన్ని రోజుల్లోనే సైంటిఫిక్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యేందుకు సిద్ధమైంది.

కరోనా వైరస్‌ ల్యాబ్‌లోనే సృష్టించారనడానికి మా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయని బ్రిటిష్‌ ప్రొఫెసర్‌ అంగూస్‌ డాల్‌గ్లిష్‌, నార్వే శాస్త్రవేత్త డాక్టర్‌ బిర్గర్‌ సొరెన్‌సెన్‌ తమ నివేదికలో పేర్కొన్నారు. ఆంకాలజీ ప్రొఫెసర్‌ అంగూస్‌ డాల్‌గ్లిష్‌ హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ రూపకల్పనలో విశేష కృషి చేస్తున్న వారిలో ఒకరు. కాగా, వైరాలజిస్ట్‌గా ఉన్న సొరెన్‌సేన్ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ‘బయోవాక్‌-19’ వ్యాక్సిన్‌ రూపకల్పనలో కీలక వ్యక్తి.

ప్రత్యేక వేలిముద్రలే ఆధారం..?

కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు చేసిన పరిశోధనలో భాగంగా.. చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్‌ను జన్యుక్రమాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అనంతరం కరోనా వైరస్‌ సహజ సిద్ధంగా ఉద్భవించింది కాదని చెప్పే ‘ప్రత్యేకమైన వేలిముద్రలు’ గుర్తించారు. ధనావేశితం కలిగిన నాలుగు అమైనో ఆమ్లాలు ఒకే శ్రేణిలో ఉండడాన్ని వీరు ప్రముఖంగా ప్రస్తావించారు. కేవలం కృత్రిమంగా తయారు చేస్తేనే ఇటువంటిది సాధ్యమవుతుందని వాదిస్తున్నారు. కరోనా వైరస్‌ సహజ ప్రక్రియలో ఉద్భవిందనడానికి ఉన్న అవకాశాలు తాము చేసిన పరిశోధనల్లో చాలా తక్కువగా కనిపించాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచి సహజసిద్ధంగా వ్యాపించిందని చెప్పడానికి చైనా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని గతేడాది నుంచి చెబుతున్నప్పటికీ అంతర్జాతీయ సంస్థలు, మెడికల్‌ జర్నల్‌లు తమ నివేదికను పట్టించుకోలేదని వాపోయినట్లు బ్రిటన్‌ మీడియా వెల్లడించింది. అయితే, వీరి పరిశోధనకు సంబంధించిన 22పేజీల పూర్తి నివేదిక త్వరలోనే ప్రచురితం కానున్నట్లు తెలిపింది.

వుహాన్‌ మీద పెరుగుతున్న అనుమానాలు..

* కరోనా వైరస్‌ మూలాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మూడు నెలల్లో తేల్చి ఓ నివేదిక ఇవ్వాలని అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ అమెరికా ఇంటలిజెన్స్‌ విభాగాన్ని అదేశించారు. అయితే, ఈ నిర్ణయాన్ని చైనా తప్పుబట్టింది.

* వైరస్‌ పుట్టుకపై దర్యాప్తు చేయాలనే ఒత్తిడి ప్రజల వైపు నుంచి రానీయకుండా కొందరు శాస్త్రవేత్తలు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌లో తాజాగా ఓ కథనం ప్రచురితమైంది.

* కరోనా వైరస్‌ బాహ్య ప్రపంచంలోకి వ్యాపించక ముందే వుహాన్‌ ల్యాబ్‌లోని చాలా మంది పరిశోధకులు అస్వస్థతకు గురైనట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్‌ కథనం వెల్లడించింది.

* ఇక చైనా శాస్త్రవేత్తలు జీవాయుధాల (Bioweapons) గురించి కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది.

* కరోనా మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని బృందం జరిపిన అధ్యయన ఫలితాలు అస్పష్టంగా ఉండడంతో మరోసారి వీటిపై మరింత దృష్టి సారించాల్సి ఉందని WHO చీఫ్‌ అభిప్రాయపడ్డారు. అంతకుముందు వెళ్లిన దర్యాప్తు బృందానికి చైనా అధికారులు సరైన సమాచారం అందించలేదనే ఆరోపణలు ఉన్నాయి.

* కరోనా మూలాలు మానవ తయారీ, వుహాన్‌ ల్యాబ్‌లోనే అంటూ వచ్చే పోస్టులను తొలగిస్తోన్న ఫేస్‌బుక్‌ తాజాగా వెనక్కి తగ్గింది. ఇకనుంచి మ్యాన్‌మేడ్‌ అంటూ చేసే పోస్టులను తొలగించమని..ఈ విషయంలో తమ విధానాన్ని మార్చుకుంటున్నట్లు ప్రకటించింది.

ఇలా కరోనా మూలాలు మానవ సృష్టే అనే కోణంలో వెలువడుతున్న నివేదికలతో చైనాపై ఒత్తిడి పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని