Corona: ఇటలీ నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా.. పారిపోయిన 13 మంది కొవిడ్‌ బాధితులు..!

ఇటలీ నుంచి పంజాబ్‌ వచ్చిన ఓ ఛార్టర్డ్‌ విమానంలో 125 మంది ప్రయాణికుల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే

Updated : 07 Jan 2022 17:24 IST

దిల్లీ: ఇటలీ నుంచి పంజాబ్‌ వచ్చిన ఓ ఛార్టర్డ్‌ విమానంలో 125 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అందులో 13 మంది కొవిడ్‌ బాధితులు అధికారుల కళ్లుగప్పి పారిపోయినట్లు తెలిసింది. దీంతో వారి ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పరారైన వ్యక్తుల పాస్‌పోర్టులను రద్దు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు అమృత్‌సర్‌ డిప్యూటీ కమిషనర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ ఖెహ్రా వెల్లడించారు.

ఇటలీలోని మిలాన్‌ నుంచి 179 మంది ప్రయాణికులతో ఓ ఛార్టర్డ్‌ విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే ఒమిక్రాన్‌ ‘ముప్పు ఉన్న’ దేశాల్లో ఇటలీ కూడా ఒకటని గుర్తించిన నేపథ్యంలో ఈ విమానంలోని ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులో కొవిడ్‌ పరీక్షలు జరిపారు. విమానంలో 19 మంది చిన్నారులు మినహా 160 మందికి పరీక్షలు చేయగా.. 125 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా సోకిన వారిని అమృత్‌సర్‌లోని వివిధ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులకు తరలించారు. వీరిని తరలించేందుకు ఎయిర్‌పోర్టు ఎదుట అంబులెన్సులు బారులు తీరాయి.

అయితే నిన్న సాయంత్రం ఆరోగ్య అధికారుల కళ్లుగప్పి 13 మంది ప్రయాణికులు ఆసుపత్రుల నుంచి పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. పాజిటివ్‌ వ్యక్తులు వెంటనే ఆసుపత్రులకు తిరిగి రాకపోతే వారి ఫొటోలను వార్తా పత్రికల్లో ప్రచురిస్తామని డిప్యూటీ కమిషనర్‌ హెచ్చరించారు. ఇప్పటికే వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 

ఒకేసారి పెద్ద ఎత్తున విదేశీ ప్రయాణికులకు పాజిటివ్‌ రావడంతో అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టులో నిన్న కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. పరీక్షల ఫలితాలతో సంతృప్తి చెందని పలువురు ప్రయాణికులు టెర్మినల్‌ భవనం వద్ద ఆందోళనకు దిగారు. తమను వెళ్లనివ్వాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు, ఆరోగ్య అధికారులు వారికి సర్దిచెప్పి ఐసోలేషన్‌కు పంపించారు.

ఇటలీలో ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తి విపరీతంగా ఉంది. దీంతో అక్కడ కేసుల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే ఆ దేశంలో 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక, మన దేశంలోనూ కొవిడ్‌ మళ్లీ విరుచుకుపడుతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో లక్షకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని