Covid Endemic: కరోనా మహమ్మారి ఎండెమిక్‌ దశకు వచ్చినట్లేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే

మహమ్మారి నుంచి స్థానికవ్యాప్తి (Endemic) దశకు వచ్చే సమయంలో ఇలా కొవిడ్‌ కేసుల్లో హెచ్చు తగ్గులు సర్వసాధారణమేనని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు.

Published : 25 Jun 2022 01:34 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా గత కొన్ని వారాలుగా కరోనా వైరస్‌ (Coronavirus) ఉద్ధృతి మళ్లీ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే, మహమ్మారి నుంచి స్థానికవ్యాప్తి (Endemic) దశకు వచ్చే సమయంలో ఇలా కొవిడ్‌ కేసుల్లో హెచ్చు తగ్గులు సర్వసాధారణమేనని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభణ కొన్ని జిల్లాలకే పరిమితమైందని పేర్కొంటున్న నిపుణులు.. మాస్కులు ధరించకపోవడం, ప్రయాణాలు, సామాజిక కార్యక్రమాలు పెరగడంతోపాటు బూస్టర్‌ డోసులు (Booster Dose) తీసుకోకపోవడం కూడా వైరస్‌ విస్తృతంగా వ్యాపించడానికి కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు.

ఎండెమిక్‌ దశ..

కరోనా వైరస్‌లో ఇప్పటికే వెయ్యి మ్యుటేషన్లు (Mutations) జరిగినప్పటికీ అందులో కేవలం ఐదు మాత్రమే ఆందోళనకరమైనవని ఎయిమ్స్‌లో సీనియర్‌ ఎపిడమాలజిస్ట్‌ డాక్టర్‌ సంజయ్‌ రాయ్‌ పేర్కొన్నారు. ‘ఒమిక్రాన్‌ (Omicron) విషయంలోనూ ఉత్పరివర్తనాలు చోటుచేసుకున్నందునే రీఇన్‌ఫెక్షన్‌, బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మహమ్మారి (Pandemic) నుంచి స్థానికవ్యాప్తి (Endemic) దశకు మార్పు చెందే క్రమంలో కొవిడ్‌ కేసులు పెరగడం సాధారణ విషయమే. తీవ్రమైన, ఆస్పత్రిలో చేరికలు, మరణాల సంఖ్య పెరగనంత వరకు పాజిటివ్‌ కేసులు పెరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలామంది వైరస్‌ బారినపడి కోలుకోవడం, మెజారిటీ ప్రజలకు వ్యాక్సిన్‌ అందడం జరిగింది. వ్యాక్సిన్‌తోపాటు వైరస్‌ బారినపడి కోలుకోవడం వల్ల పొందిన రోగనిరోధకత సుదీర్ఘకాలంపాటు రక్షణ కల్పిస్తుందని అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ రక్షణను క్షీణింపజేసే కొత్త వేరియంట్‌ (New Variant) వస్తే తప్ప ఎటువంటి ఆందోళన అవసరం లేదు’ అని కొవాగ్జిన్‌ (Covaxin) ప్రయోగాల్లో ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌గా పనిచేసిన డాక్టర్‌ రాయ్‌ స్పష్టం చేశారు.

ఆందోళన అవసరం లేదు..

అంటువ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల కేసుల్లో ఇలా హెచ్చుతగ్గులు కనిపించడం సాధారణమేనని ప్రముఖ ఎపిడమాలజిస్టు డాక్టర్‌ చంద్రకాంత్‌ లహారియా స్పష్టం చేశారు. ఇటువంటి సమయంలో సాధారణ కేసుల సంఖ్య కాకుండా కేవలం తీవ్ర లక్షణాలు, ఆస్పత్రి చేరికలు ఉంటేనే వాటిపై శ్రద్ధ పెట్టాలని.. అటువంటివి లేనప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం వైరస్‌ విస్తృతి కొన్ని జిల్లాలు, ప్రాంతాలకే పరిమితమైందని.. ఇవి రాష్ట్రం మొత్తం నమోదవుతున్నట్లు చూడవద్దని ఐసీఎంఆర్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సమీరన్‌ పాండ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేవలం కొవిడ్‌ కాకుండా టీబీ వంటి వ్యాధులను నివారించేందుకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

భారీగా పాజిటివిటీ రేటు..

మహారాష్ట్ర, కేరళ, దిల్లీ, కర్ణాటక, తమిళనాడు, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, గోవా, పంజాబ్‌ రాష్ట్రాల్లో జూన్‌ 10 తర్వాత కొవిడ్‌ కేసుల్లో పెరుగుదల గణనీయంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 51 జిల్లాల్లో వారాంతపు కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10శాతంగా నమోదుకాగా కేవలం కేరళలోనే 12 జిల్లాలు ఉన్నాయి. మహారాష్ట్ర, మిజోరం, అస్సాం, రాజస్థాన్‌, దిల్లీల్లోని పలు జిల్లాల్లో వైరస్‌ విస్తృతి ఎక్కువగా ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం, రోజువారీ కేసుల సంఖ్య 17వేలకు చేరుకుంది. పాజిటివిటీ రేటు కూడా నాలుగు శాతం దాటడంతో నాలుగో వేవ్‌పై (Fourth Wave) ఆందోళన నెలకొంది. దీంతో భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని