కరోనా ప్రకోపం: ముంబయిని మించిన దిల్లీ!

కరోనా వైరస్‌ నాలుగో విజృంభణ(ఫోర్త్‌ వేవ్‌) ధాటికి దేశ రాజధాని దిల్లీ వణికిపోతోంది. గతకొన్ని రోజులుగా అక్కడ భారీగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కరోనా కేసుల్లో దేశంలోనే అత్యధిక తీవ్రత ఉన్న నగరంగా దిల్లీ నిలిచింది. రోజువారీ కేసులు ఇంతవరకు ముంబయిలో ఎక్కువ నమోదవుతుండగా.. తాజాగా ఆ స్థానంలోకి దేశ రాజధాని దిల్లీ చేరిపోయింది.

Updated : 15 Apr 2021 19:31 IST

10 రోజుల్లో 234శాతం కేసుల పెరుగుదల

దిల్లీ: కరోనా వైరస్‌ నాలుగో విజృంభణ(ఫోర్త్‌ వేవ్‌) ధాటికి దేశ రాజధాని దిల్లీ వణికిపోతోంది. గతకొన్ని రోజులుగా అక్కడ భారీగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కరోనా కేసుల్లో దేశంలోనే అత్యధిక తీవ్రత ఉన్న నగరంగా దిల్లీ నిలిచింది. రోజువారీ కేసులు ఇంతవరకు ముంబయిలో ఎక్కువ నమోదవుతుండగా.. తాజాగా ఆ స్థానంలోకి దేశ రాజధాని దిల్లీ చేరిపోయింది.

ఏప్రిల్‌ 4న ముంబయిలో అత్యధికంగా 11,163 కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశ రాజధాని దిల్లీలో రికార్డు స్థాయిలో 17 వేల కేసులు బయటపడ్డాయి. కొత్తగా 100 మంది కొవిడ్‌తో మరణించారు. దేశంలో కరోనా వైరస్‌ అడుగు పెట్టాక 24 గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. గత ఏడాది నవంబరులో దిల్లీలో అత్యధికంగా ఒకేరోజు 8593 కేసులు నమోదయ్యాయి. ఐదు నెలల అనంతరం ఎన్నడూ లేనంతగా 10 వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు దిల్లీలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 11 వేలకు చేరింది.

పాజిటివ్‌ రేటు పెరగడం ఆందోళనకరం

ప్రస్తుతం దిల్లీలో రోజూ లక్ష కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా.. పాజిటివిటీ రేటు 15.92గా ఉంది. ఏప్రిల్‌ 4 నుంచి 13 మధ్యలో ఏకంగా 77,775 కేసులు నమోదయ్యాయి. కేవలం పది రోజుల్లోనే కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల్లో 234 శాతం పెరుగుదల వచ్చింది. ఇలా కొన్ని రోజుల్లోనే కరోనా పాజిటివ్‌ రేటు ఈ స్థాయిలో పెరగడం ఆందోళనకరమని నిపుణుల అభిప్రాయం. గత కొన్ని రోజులుగా ఆసుప్రతులు, రోగుల పరిస్థితి చూస్తుంటే దిల్లీ అసాధారణ సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని అపోలో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ సురంజిత్ ఛటర్జీ అభిప్రాయపడ్డారు. అయితే అక్కడ వైరస్‌ తీవ్రత ఒక్కసారిగా పెరగడానికి కారణం మునుపటి రకం కంటే భిన్నమైన(మ్యుటేషన్ చెందిన) కరోనా వైరస్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఫోర్టిస్‌ ఆసుపత్రి ఛాతి వైద్యురాలు రిచా సరీన్‌ పేర్కొన్నారు. యువత కూడా ఈసారి కరోనా వైరస్‌ బారిన పడుతుండడం కలవరపెట్టే అంశమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని