Third Wave: 80 లక్షల డోసులతోనే అడ్డుకట్ట..!

కరోనా రెండో దశ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న భారత్‌ను మూడో దశ ముప్పు వెంటాడుతోంది. నిపుణుల హెచ్చరికల మేరకు మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి....

Published : 07 Jul 2021 19:30 IST

పంపిణీలో వేగం పెంచాలని నిపుణుల సూచన

దిల్లీ: కరోనా రెండో దశ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న భారత్‌ను మూడో దశ ముప్పు వెంటాడుతోంది. నిపుణుల హెచ్చరికల మేరకు మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. మూడోదశ తీవ్రత తగ్గించేందుకుగాను ఎక్కువ జనాభాకు టీకా పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యం చేరుకోవాలంటే టీకాల లభ్యత, పంపిణీ వేగం ఇంకా పుంజుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా మూడో దశ అనివార్యమైన నేపథ్యంలో సాధ్యమైనంతవరకు తీవ్రతను తగ్గించేందుకు జనాభాలో దాదాపు 60 శాతం మందికి టీకా రెండు డోసులు అందించాల్సిఉంది. డిసెంబర్‌ నాటికి ఈ లక్ష్యం చేరుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అందుకోసం ప్రతిరోజు దాదాపు 80 లక్షల డోసులు పంపిణీ చేయాల్సిఉంది. ప్రతిరోజు 1.25 కోట్ల డోసులు పంపిణీ చేసే సామర్థ్యం ఉన్నా.. కనీసం కోటి మందికి టీకా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జులై నుంచి వేగం పెంచాలని అనుకున్నప్పటికీ ప్రస్తుతం ప్రతిరోజు 40 లక్షల డోసులు మాత్రమే పంపిణీ చేయగలుగుతున్నారు. ఇదే వేగం కొనసాగితే లక్ష్యం చేరుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దేశంలో కరోనా టీకా మెగా డ్రైవ్‌ ప్రారంభమైనప్పటి నుంచి డోసుల పంపిణీ పెరిగింది. గత నెల చివరి వారంలో నిత్యం 80 లక్షల డోసుల్ని పంపిణీ చేశారు. తర్వాత అది 40 లక్షలకు తగ్గింది. గత ఆదివారం కేవలం 15 లక్షల డోసులు మాత్రమే పంపిణీ చేశారు. వారంలో సగటున కేవలం 40 లక్షల డోసులు మాత్రమే అందిస్తున్నారు. కొన్ని చోట్ల వ్యాక్సిన్‌ కొరత, మరికొన్ని చోట్ల ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వ్యాక్సిన్ల కొరత లేదని కేంద్రం పేర్కొంటున్నా.. కొన్ని రాష్ట్రాల వాదన అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా పంజాబ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలు తమకు ఎక్కువ డోసులు కేటాయించాలని కోరుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మాత్రం రాష్ట్రాల వద్ద రెండు కోట్ల డోసులు ఉన్నాయని వెల్లడిస్తోంది. ఇదే సమయంలో ఈ నెలలో 12 కోట్ల డోసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంటోంది.

వ్యాక్సిన్ల కొరతను నివారించేందుకుగాను ఉత్పత్తి సంస్థలు వేగం పెంచాయి. కొవిషీల్డ్‌ తయారు చేస్తున్న సీరం సంస్థ జూన్‌ నెలలో 10 కోట్ల డోసులు అందించినట్లు తెలిపింది. భారత్‌ బయోటెక్‌ కూడా ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. స్పుత్నిక్‌-వి టీకా డోసుల ఉత్పత్తి పెంచేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఇతర సంస్థల సహకారం తీసుకుంటోంది. మోడెర్నా వ్యాక్సిన్‌ దిగుమతికి కేంద్రం అనుమతించింది. ఇప్పటివరకు 35 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు టీకాల లభ్యత పెంచడంతోపాటు పంపిణీ వేగం పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని