ఒమిక్రాన్‌ వేవ్‌.. భారత్‌లో ఎప్పుడు ముగియనుంది..?

ప్రస్తుతం కనిపిస్తోన్న కొవిడ్‌ విజృంభణ ఫిబ్రవరి నుంచి తగ్గుముఖం పట్టనున్నట్లు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు అంచనా వేశారు.

Updated : 13 Jan 2022 17:09 IST

ఐఐఎస్‌, ఐఎస్‌ఐ పరిశోధకుల తాజా అంచనాలు

దిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో మళ్లీ మొదలైన కొవిడ్‌ ఉద్ధృతి.. రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థలు అధ్యయనం చేపట్టాయి. ప్రస్తుతం కనిపిస్తోన్న కొవిడ్‌ విజృంభణ ఫిబ్రవరి నుంచి తగ్గుముఖం పట్టనున్నట్లు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు అంచనా వేశారు. అయితే, ఇది ఆయా రాష్ట్రాల్లో భిన్నంగా ఉంటుందని.. మార్చి, ఏప్రిల్‌ నాటికల్లా తగ్గిపోవచ్చని లెక్కగట్టారు. అయితే, గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు నిత్యం దాదాపు 8లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. దేశంలో ప్రస్తుతం (జనవరి 10 వరకు) నమోదవుతోన్న కొవిడ్‌ గ్రాఫ్‌తోపాటు దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ సంక్రమణ రేటును పరిగణనలోకి తీసుకొని తాజా అంచనాలు రూపొందించామని ఐఐఎస్‌, ఐఎస్‌ఐ పరిశోధకులు వెల్లడించారు.

ఈ అంచనాలను మూడు సందర్భాల్లో అనగా.. వైరస్‌ ముప్పు 100శాతం, 60శాతం, 30శాతం పొంచివున్న జనాభాను పరిగణనలోకి తీసుకొని రూపొందించారు. ఈ మూడింటిలోనూ వైరస్‌ ఉద్ధృతి ఏప్రిల్‌ నాటికే తగ్గుముఖం పట్టే అవకాశాలను సూచించినట్లు తెలిపారు. అయితే, వైరస్‌ సంక్రమణ ముప్పు 30శాతం, 60శాతం ఉన్న సందర్భాల్లో కొవిడ్‌ ఉద్ధృతి ఫిబ్రవరిలోనే తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. 100శాతం ప్రజలకు ముప్పు ఉన్న సందర్భాల్లో మాత్రం వైరస్‌ ఉద్ధృతి తగ్గడానికి మరింత సమయం పట్టే అవకాశమున్నట్లు లెక్కగట్టారు.

* సంక్రమణ ముప్పు జనాభా 100శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే క్లిష్ట పరిస్థితుల్లో గరిష్ఠంగా నిత్యం 4లక్షల మందికి ఆస్పత్రి చేరికలు నమోదు కావచ్చు.

* అదే 60శాతం జనాభాకు ముప్పు ఉన్నట్లయితే రోజు 3లక్షల మందికి ఆస్పత్రి సేవలు అవసరం అవుతాయి.

* అలాంటి సమయంలో 20వేల ఐసీయూ పడకలు అవసరమయ్యే అవకాశం ఉంటుంది.

* ఈ వేవ్‌ ఫిబ్రవరిలో తగ్గుముఖం పట్టనుండగా మార్చి 1 నాటికి వీటి సంఖ్య స్థిరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

* ఏప్రిల్‌ నెలలో దేశంలో మూడో వేవ్‌ ముగుస్తుంది. అయినప్పటికీ వైరస్‌ తీవ్రతను బట్టి ఆయా రాష్ట్రాల్లో మారే అవకాశాలున్నాయి.

* మహారాష్ట్రలో రోజువారీగా గరిష్ఠంగా 1.75లక్షల కేసులు లేదా లక్ష కేసులు నమోదయ్యే సూచనలున్నాయి.

* దిల్లీ, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య భారీగా నమోదయ్యే అవకాశముంది.

* పంజాబ్‌, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లో మాత్రం వేవ్‌ ప్రభావం కాస్త ఆలస్యంగా కనిపించనుందని ఐఐఎస్‌, ఐఎస్‌ఐ పరిశోధకులు అంచనాలు రూపొందించారు.

దిల్లీ, ముంబయి, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో  48 గంటలకు అవసరమైన ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని వైద్య కేంద్రాలకు సూచించింది. ఇదే సమయంలో దిల్లీలో గత ఐదు రోజులుగా ఆస్పత్రి చేరికలు పెరగకపోవడం ఊరట కలిగించే విషయమని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ పేర్కొన్నారు. రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు ముంబయిలోనూ రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల ఉన్నట్లు ముంబయి మేయర్‌ కిశోరీ పెడ్నేకర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని