ఆ 8 చోట్లే కొవిడ్‌ ఉగ్రరూపం! 

దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్రతరమవుతోంది. గత కొన్ని నెలలుగా మళ్లీ కేసులు పెరిగిపోతున్నాయి. టీకా పంపిణీ ప్రక్రియ శరవేగంగా ....

Published : 07 Apr 2021 20:48 IST

దిల్లీ: దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్రతరమవుతోంది. గత కొన్ని నెలలుగా మళ్లీ కేసులు పెరిగిపోతున్నాయి. టీకా పంపిణీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నప్పటికీ గతేడాదితో పోలిస్తే ఈ నెలలోనే మళ్లీ ‘లక్ష’కు పైగా కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. కఠిన ఆంక్షలు విధిస్తున్నా.. కొవిడ్‌ బాధితుల గ్రాఫ్‌  మళ్లీ  పెరిగిపోతోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి అంతగా లేకపోయినప్పటికీ మహారాష్ట్ర సహా ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. 

నిన్న దేశ వ్యాప్తంగా నమోదైన 1,15,736 కొత్త కేసుల్లో 81శాతం కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. వీటిలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, యూపీ, దిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ ఉన్నట్టు తెలిపింది. అలాగే, ప్రస్తుతం దేశంలో ఉన్న  8,43,473 యాక్టివ్‌ కేసుల్లో దాదాపుగా 75శాతం 5 రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ కర్ణాటక, కేరళ, యూపీలలోనే 74.5శాతం కేసులు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. వీటిలో ఒక్క మహారాష్ట్రలోనే 56.17 శాతం ఉండటం అక్కడ వైరస్‌ ఉద్ధృతికి అద్దంపడుతోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి క్రియాశీల కేసులు 25.41శాతంగా ఉన్నాయి. 

మహారాష్ట్రలో పుణె, ముంబయి, ఠానే, నాగ్‌పూర్‌, నాసిక్‌లలో అత్యధిక యాక్టివ్‌ కేసులు ఉండగా.. కర్ణాటకలో బెంగళూరు అర్బన్‌, బీదర్‌, కలబుర్గి, మైసూర్‌, తుమకూరులలో ఉన్నాయి. మరోవైపు, కొత్తగా నమోదవుతున్న మరణాల విషయంలోనూ మహారాష్ట్రనే అగ్రస్థానంలో ఉంది. నిన్న ఒక్కరోజే దేశంలో 630మంది కొవిడ్‌తో మరణించగా.. వీటిలో 84.44శాతం మరణాలు కేవలం ఎనిమిదిరాష్ట్రాల్లోనే ఉండటం ఆందోళనకరం. మహారాష్ట్రలో అత్యధికంగా 297మంది ప్రాణాలు కోల్పోగా.. పంజాబ్‌లో 61 మంది మరణించారు. నిన్న 11 రాష్ట్రాల్లో ఒక్క మరణం కూడా సంభవించకపోవడం విశేషం.

ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితి ఇలా..

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని