Covid Updates: మృతుల్లో 75% టీకా తీసుకోనివారే... 31 వరకు అక్కడ స్కూళ్లు బంద్‌

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో.......

Published : 15 Jan 2022 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2.64లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం గమనార్హం. రోజురోజుకీ కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతున్న వేళ పలు రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షల్ని మరింత కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు తీసుకొంటున్నాయి.

మధ్యప్రదేశ్‌లో 31వరకు స్కూళ్లు బంద్‌
మధ్యప్రదేశ్‌లో కొవిడ్‌ తీవ్రత పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, హాస్టళ్లను జనవరి 31వరకూ మూసివేస్తున్నట్టు ప్రకటించింది. 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయడంతో పాటు మతపరమైన కార్యక్రమాలు, కమర్షియల్‌ ఫెయిర్‌లు, ర్యాలీలపైనా నిషేధం విధిస్తున్నట్టు అదనపు చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ రాజేశ్‌ రాజోరా తెలిపారు. రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన, సామాజిక, వినోద సంబంధిత కార్యక్రమాలకు 250మందిని మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపారు. అలాగే, క్రీడా స్టేడియాల్లో 50శాతం సిటింగ్‌ సామర్థ్యంతోనే అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రజలంతా కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం మధ్యప్రదేశ్‌లో 4031 కొత్త కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. 

దిల్లీలో కొవిడ్‌ మృతుల్లో 75శాతం టీకా తీసుకోనివారే..: సత్యేందర్‌ జైన్‌
దిల్లీ: గత కొన్ని రోజులుగా దిల్లీలో కరోనా సునామీ కొనసాగుతోంది. కొవిడ్‌తో మృతిచెందినవారిలో దాదాపు 75శాతం మంది టీకాలు తీసుకోనివారేనని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అన్నారు. జనవరి 9నుంచి 12 వరకు 97మంది కొవిడ్‌తో మృతిచెందగా.. వారిలో 70మంది టీకాలు తీసుకోనివారు కాగా.. 19మంది కేవలం తొలిడోసు మాత్రమే తీసుకున్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే, 8మంది మాత్రమే రెండు డోసులూ తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో టీకాలు తీసుకోవడం అత్యంత ఆవశ్యకమని మంత్రి సూచించారు. దిల్లీలోని ఆస్పత్రుల్లో ప్రస్తుతం 13వేలకు పైగా పడకలు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు.

ఎన్నికలు వాయిదా వేయొచ్చేమో చూడండి:  కోల్‌కతా హైకోర్టు

కోల్‌కతా: బెంగాల్‌లోని పలుచోట్ల జరగాల్సిన పురపాలక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కోల్‌కతా హైకోర్టు కీలక సూచనలు చేసింది. కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతున్నవేళ నాలుగు మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో నిర్వహించాల్సిన ఎన్నికలను వాయిదా వేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించింది. నాలుగు నుంచి ఆరు వారాల పాటు వాయిదా వేసే అవకాశం ఉందేమో చూడాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాశ్‌ శ్రీవాస్తవ, జస్టిస్‌ అజోయ్‌ కుమార్‌ ముఖర్జీ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు జారీచేసింది. 48 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. కొవిడ్‌ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో నాలుగు చోట్ల జరగాల్సిన మున్సిపల్‌ ఎన్నికల వాయిదా అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. మరోవైపు, బిధ్నానగర్‌, చందన్‌నగర్‌, సిలిగురి, అనాసోల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లకు జనవరి 22న ఎన్నికల నిర్వహణకు ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ని ప్రకటించింది.

కర్ణాటకలో రికార్డుస్థాయిలో టెస్ట్‌లు.. కేసులెన్నంటే?
బెంగళూరులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కర్ణాటక వ్యాప్తంగా 28,723 కేసులు రాగా.. వాటిలో ఒక్క బెంగళూరు నగరం పరిధిలోనే 20,121 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటం గమనార్హం. కొవిడ్‌ మహమ్మారి ప్రారంభమైన తర్వాత తొలిసారి గడిచిన 24గంటల వ్యవధిలో 2.21లక్షల టెస్ట్‌లు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్‌ వెల్లడించారు.  రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రిపాలవుతున్నవారి సంఖ్య మాత్రం 6శాతంగానే ఉన్నట్టు తెలిపారు. అయితే, నర్సింగ్ సిబ్బంది కొవిడ్‌ బారినపడుతుండటం ఆందోళనకంగా మారుతోందని చెప్పారు. ఫిబ్రవరి తొలి వారానికి థర్డ్‌వేవ్‌ గరిష్ఠానికి చేరుకుంటోందనీ.. ఆ తర్వాత మూడు లేదా నాలుగో వారంలో తగ్గుదల మొదలవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారన్నారు. కర్ణాటకలో తాజాగా 14మంది కొవిడ్‌తో మృతిచెందగా.. వారిలో బెంగళూరు నగరంలోనే ఏడుగురు ఉన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 12.98శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,41,337 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఒక్క బెంగళూరు మహానగరంలోనే 1.01లక్షల కేసులు ఉన్నాయి.

దిల్లీలో కాస్త తగ్గిన కేసులు..

దేశ రాజధాని దిల్లీలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో హస్తినలో 24,383 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. నిన్నటి(28,867)తో పోలిస్తే ఇవి 15.5శాతం తక్కువ. కాగా పాజిటివిటీ రేటు 30.64 శాతానికి చేరుకుంది. ఇదిలా ఉంటే 24 గంటల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంత రాజధానిలో మరణాల సంఖ్య 25,305కు చేరింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2529 మంది సర్కారు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో 815 మంది ఆక్సిజన్‌ పడకల్లో ఉండగా, 99 మంది వెంటిలేటర్ల సహాయంతో చికిత్స పొందుతున్నారు.

కేరళలో 23 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు..

కేరళలో శుక్రవారం 68,971 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా అందులో 16,338 మందికి నిర్ధరణ అయ్యింది. దీంతో పాజిటివిటీ రేటు 23.7శాతంగా నమోదైంది. వైరస్‌తో తాజాగా 20 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 50,568కి చేరుకుంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 76,819కు చేరింది. అయితే ప్రస్తుతమున్న యాక్టివ్‌ కేసుల్లో 4.4శాతం మంది మాత్రమే హాస్పిటళ్లలో చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ వెల్లడించారు.

ముంబయిలో 11 వేలకుపైనే..

దేశ ఆర్థిక రాజధానిలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గింది. శుక్రవారం 11,317 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్నటితో పోలిస్తే ఈ కేసులు 17శాతం తక్కువ. పాజిటివిటీ రేటు 20.6 శాతానికి తగ్గింది. ఇది నిన్న 21.73గా ఉంది. అయితే గురువారంతో పోలిస్తే 12.86శాతం పరీక్షల్లో తగ్గుదల ఉంది. 24 గంటల్లో తొమ్మిది మంది మృతిచెందారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని