Marriage Age: అమ్మాయిల అభ్యున్నతి కోసమే ఆ నిర్ణయం : మోదీ

దేశ అమ్మాయిల అభ్యున్నతి కోసమే మహిళల పెళ్లి వయసును 18 నుంచి 21ఏళ్లకు పెంచేలా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.

Published : 13 Jan 2022 01:44 IST

యువతలో వ్యాక్సిన్‌ వేగంపై ప్రధాని ప్రశంస

దిల్లీ: దేశ అమ్మాయిల అభ్యున్నతి కోసమే మహిళల పెళ్లి వయసును 18 నుంచి 21ఏళ్లకు పెంచేలా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తద్వారా వారి విద్యాభ్యాసానికి సరైన సమయం లభించడంతో పాటు కెరీర్‌ను తీర్చిదిద్దుకోవడానికి దోహదం చేస్తుందని అన్నారు. ఇక కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడంలో దేశ యువత ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తోందన్న ఆయన.. ఇప్పటికే 15 నుంచి 18ఏళ్ల మధ్య వయసున్న 2కోట్ల మంది యువతీ, యువకులు వ్యాక్సిన్‌ తీసుకోవడం వారి బాధ్యతను సూచిస్తోందని ప్రశంసించారు. స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఈ విధంగా మాట్లాడారు.

దేశ యువతపై ఎంతో విశ్వాసం ఉందన్న ప్రధాని మోదీ.. ‘పోటీ చేసి జయించు’ అనే నినాదంతో నవ భారత నిర్మాణంలో వారు ముందుకెళ్తున్నారని అన్నారు. అంతేకాకుండా యువతలో ‘ఏదైనా చేయగలమనే ’ నమ్మకం భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ఇక సార్టప్‌ల స్వర్ణయుగంలోకి అడుగుపెడుతోన్న భారత్‌.. 50వేల స్టార్టప్‌లను ఏర్పాటు చేసే లక్ష్యంతో పనిచేస్తోందని చెప్పారు. వీటిలో గడిచిన ఆరేడు నెలల్లోనే పదివేల స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయని వెల్లడించారు. ఈ క్రమంలో యువత ఏర్పరచుకుంటోన్న లక్ష్యాలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా వారి కలలు సాకారం చేసుకునేందుకు తమ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు కృషి చేస్తోందని అన్నారు. ఇందుకోసం ముద్ర యోజనా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌తో పాటు జాతీయ విద్యావిధానం వంటివి తోడ్పాటునందిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, మహిళల వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లుపై విపక్షాలు, పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి పంపాలని సభ నిర్ణయించింది. రాజ్యసభలో భాజపా ఎంపీ వినయ్‌ సహస్రాబుద్ధే నేతృత్వంలో 31 మంది సభ్యులతో ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్‌ ఈ బిల్లును పరిశీలించనుంది. అయితే,  అందులో ఒక్క మహిళకు (తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితా దేవ్‌) మాత్రమే చోటు దక్కడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని