ఏప్రిల్‌లో అన్ని రోజులూ టీకా పంపిణీ

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ నెలలో అన్ని రోజులూ టీకా పంపిణీ

Published : 01 Apr 2021 14:21 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ నెలలో అన్ని రోజులూ టీకా పంపిణీ కొనసాగుతుందని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ‘‘ఏప్రిల్‌ మొత్తం వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంది. గెజిటెడ్‌ సెలవు రోజుల్లోనూ టీకా అందజేస్తాం’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ వ్యాక్సిన్ కేంద్రాల్లో ప్రతి రోజూ వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్న కేంద్రం.. ఇందుకోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అత్యంత వేగంగా ఎక్కువ మందికి టీకాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

దేశంలో గత కొద్దిరోజులుగా కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఏప్రిల్‌ 1 నుంచి 45ఏళ్లు పైబడిన వారందరికీ టీకా పంపిణీ చేపట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. అంతేగాక, టీకాలు వచ్చాయని ప్రజల్లో వైరస్‌ పట్ల నిర్లక్ష్యం తగదని హెచ్చరించిన ప్రభుత్వం.. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. దేశంలో జనవరి 16 నుంచి కరోనా టీకా పంపిణీ మొదలైంది. ఇప్పటి వరకు 6.5కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 

దేశంలో గడిచిన 24 గంటల్లో 72వేల పైన కొత్త కేసులు నమోదయ్యాయి. గతేడాది అక్టోబరు తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. మరణాల సంఖ్య కూడా తీవ్రంగానే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్‌ ఆందోళనకర రీతిలో ఉంది. దీంతో పాటు కర్ణాటక, పంజాబ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ కేసులు పెరిగిపోతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని