Vaccination: నిత్యం కోటి మందికి పంపిణీ లక్ష్యంగా!

దేశంలో కరోనా వ్యాక్సిన్లకు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

Published : 22 Jun 2021 17:27 IST

కొవిడ్‌ వర్కింగ్ గ్రూప్‌ చీఫ్‌ ఎన్‌కే అరోరా

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్లకు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. జులై చివరినాటికి 22కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్న ప్రభుత్వం.. వచ్చే నెల నుంచి నిత్యం కోటి డోసులను పంపిణీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఇక ప్రస్తుతానికి కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధిని మార్చే అవసరం లేదని.. వ్యాక్సిన్‌ పనితీరుపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషణ జరుపుతున్నామని వెల్లడించింది.

జులై చివరి నాటికి 22కోట్ల డోసులు..

‘ప్రతినిత్యం కనీసం కోటి మందికి కరోనా వ్యాక్సిన్‌ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిరోజు కోటి 25లక్షల డోసులు పంపిణీ చేసే సామర్థ్యం ఇప్పటికే ఉంది’ అని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. మార్గదర్శకాలను సవరించిన తొలిరోజునే దాదాపు 82.7లక్షల మందికి టీకాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశంలో ప్రతి మారుమూల ప్రాంతానికి వ్యాక్సిన్‌ సరఫరా చేసే విధంగా వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని.. ముఖ్యంగా కొండ, గిరిజన ప్రాంతాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నామని ఎన్‌కే అరోరా తెలిపారు. టీకాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతోపాటు ఆశా వర్కర్ల ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఎన్‌కే అరోరా చెప్పారు.

కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధిపై..

కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిపై మాట్లాడిన ఎన్‌కే అరోరా.. ప్రస్తుతం ఈ గడువును మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నేషనల్‌ వ్యాక్సిన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ నుంచి సమాచారం సేకరిస్తూ.. వ్యాక్సిన్‌ల వాస్తవిక సామర్థ్యం, డోసుల మధ్య వ్యవధి, వేరియంట్‌ల ప్రభావంపై ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నామన్నారు. ప్రస్తుతం రెండు డోసుల గడువుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కనీసం ఒక్కడోసు టీకాతో ప్రయోజనాలే కలుగుతున్నాయని చెప్పారు.

భారీ పంపిణీ కొత్తేమీ కాదు..

రికార్డు స్థాయిలో వ్యాక్సిన్‌ పంపిణీ చేయడం మనకు కొత్తేమీ కాదని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. కేవలం ఒకేవారంలో 17కోట్ల చిన్నారులకు పోలియో వ్యాక్సిన్‌ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఏదైనా భారీ కార్యక్రమాన్ని తలపెడితే.. దాన్ని సాధించే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు. దేశంలో కరోనా విజృంభిస్తోన్న వేళ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుందనే విశ్వాసాన్ని ఎన్‌కే అరోరా వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌లపై వచ్చే వదంతులను, అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ టీకా తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇదిలాఉంటే, దేశంలో ఇప్పటివరకు 28కోట్ల 87లక్షల వ్యాక్సిన్‌ డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. వీరిలో 23కోట్ల మంది కనీసం ఒకడోసు తీసుకోగా.. మరో ఐదు కోట్ల మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. నిన్న ఒక్కరోజే గరిష్ఠంగా 86లక్షల డోసులను పంపిణీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు