Biological E: టీకాకు 90శాతం సమర్థత..?

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న బయోలాజికల్‌ ఇ (BE) తయారు చేస్తోన్న కార్బివాక్స్‌ (Corbevax) టీకా ప్రయోగాల్లో దాదాపు 90శాతానికిపైగా ప్రభావశీలత చూపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated : 09 Dec 2021 16:41 IST

కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ అంచనా

దిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ అభివృద్ధి చేస్తోన్న టీకాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొవాగ్జిన్‌ టీకా మహమ్మారిని నిరోధించడంలో మెరుగైన పనితీరు కనబరుస్తుండగా, తాజాగా మరో దేశీయ టీకా కూడా అత్యంత ఆశాజనక ఫలితాలు ఇస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న బయోలాజికల్‌ ఇ (BE) తయారు చేస్తోన్న కార్బివాక్స్‌ (Corbevax) టీకా ప్రయోగాల్లో దాదాపు 90శాతానికిపైగా ప్రభావశీలత చూపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

‘ఈమధ్యే విడుదలైన నొవావాక్స్‌ టీకా ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి. భారత్‌లోనే ఏటా దాదాపు వంద కోట్ల డోసులు ఉత్పత్తి కానుండడంతో ఈ టీకాపై అంచనాలు పెరిగాయి. 90శాతం సామర్థ్యం కలిగిన టీకా చౌక ధరలోనే అందుబాటులోకి రానుంది. ఇదే సమయంలో భారత్‌లో మూడో దశకు సిద్ధమైన బయోలాజికల్‌ ఇ (బీఈ) వ్యాక్సిన్‌ కూడా ఇదేవిధమైన ఫలితాలు కనబరుస్తోంది’ అని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్‌ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో వినియోగించిన సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ టీకాలు అన్ని వయసులవారికీ సురక్షితమని తెలిపారు. అక్టోబర్‌ నాటికి ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. తుది ఫలితాలు ఇదే విధంగా ఉన్నట్లయితే మహమ్మారి పోరులో ఈ వ్యాక్సిన్‌లు గేమ్‌ ఛేంజర్‌గా మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో వివిధ అభివృద్ధిలో దశల్లో ఉన్న కరోనా టీకాల వివరాలను ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్‌కే అరోరా వెల్లడించారు.

వీటితో పాటు భారత్‌లో మరో రెండు వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయని ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. ముఖ్యంగా జైడస్‌ క్యాడిలాతో పాటు పుణెకు చెందిన జెన్నోవా ఫార్మా (ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో) తయారు చేసిన వ్యాక్సిన్‌ రెండో దశ ప్రయోగాల్లో ఉన్నాయని చెప్పారు. సెప్టెంబర్‌ నాటికి ఇవి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇలా మరికొన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్‌ల కోసం ప్రపంచ దేశాలు భారత్‌పైనే ఆధారపడే పరిస్థితి వస్తుందని ఎన్‌కే అరోరా విశ్వాసం వ్యక్తం చేశారు.

కార్బివాక్స్‌ (Corbevax) కరోనా వ్యాక్సిన్‌పై హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ (బీఈ) ప్రయోగాలు చేపడుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడోదశ ప్రయోగాలకు సిద్ధంకాగా జులై నాటికి ఇవి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని