R-Value: కరోనా విజృంభణ.. ఊరటనిచ్చే కబురు!

ఈ తరుణంలో ఐఐటీ పరిశోధకులు ఊరటనిచ్చే కబురు అందించారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సంక్రమణ తీరును తెలిపే ఆర్‌-వాల్యూ తగ్గుముఖం పడుతున్నట్లు వెల్లడించారు....

Published : 24 Jan 2022 01:56 IST

చెన్నై: దేశంలో కరోనా వ్యాప్తి తీరు ఆందోళన కలిగిస్తోంది. గత మూడు రోజులుగా కొత్త కేసులు మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఐఐటీ పరిశోధకులు ఊరటనిచ్చే కబురు అందించారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సంక్రమణ తీరును తెలిపే ఆర్‌-వాల్యూ (రీ-ప్రొడక్షన్‌ నంబర్‌) తగ్గుముఖం పడుతున్నట్లు వెల్లడించారు. జనవరి 14-24 మధ్య ఆర్‌-వాల్యూ 1.57గా నమోదైనట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో మరో 14 రోజుల్లో అంటే ఫిబ్రవరి 6 నాటికి దేశంలో కేసుల సంఖ్య తారస్థాయికి చేరుకుంటుందని పరిశోధకులు వెల్లడించారు. జనవరి 7-13 మధ్య ఆర్‌-వాల్యూ 2.2గా, 1-6వ తేదీల మధ్య 4గా, డిసెంబరు 25-31 మధ్య 2.9గా ఉన్నట్లు తెలిపారు. క్రమంగా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఆచార్య నీలేశ్‌ ఎస్‌ ఉపాధ్యాయ్‌ నేతృత్వంలోని గణిత విభాగం ఈ ప్రాథమిక విశ్లేషణను అందించింది.

ఈ పరిశోధన వివరాల ప్రకారం.. ముంబయిలో ఆర్‌-వాల్యూ 0.67గా, దిల్లీలో 0.98గా, చెన్నైలో 1.2గా, కోల్‌కతాలో 0.56గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ముంబయి, కోల్‌కతాలో కొవిడ్‌ విజృంభణ ఇప్పటికే తారస్థాయికి చేరుకొందని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జయంత్‌ ఝా తెలిపారు. దిల్లీ, చెన్నైలో మాత్రం ఇంకా భారీ స్థాయిలో కేసులు రావాల్సి ఉందన్నారు. 

వైరస్‌ సోకిన వ్యక్తి తిరిగి ఎంత మందికి వ్యాప్తి చేస్తారనేది ఆర్‌-వాల్యూగా లెక్కిస్తారు. ఉదాహరణకు ఈ విలువ 1 ఉంటే... కరోనా సోకిన వ్యక్తి ఇంకొకరికి అంటిస్తారన్న మాట. సాధారణంగా ఆర్‌ వాల్యూ ఒకటి దాటితే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే. అంటే 100 మందికి కరోనా ఉంటే వారు మరో వందమందికి పైగా వైరస్‌ను వ్యాప్తి చేస్తారు. ఆర్‌వాల్యూ విలువ పెరిగేకొద్దీ ఈ విధంగా వైరస్‌ గొలుసుకట్టు వ్యాప్తి విస్తరిస్తుంది.  

దేశంలో ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 18,75,533 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,33,533 మందికి వైరస్ సోకినట్లు తేలింది. పాజిటివిటీ రేటు 17.22% నుంచి 17.78% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కొత్తగా మరో 525 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని