టీకాలపై దుష్ప్రచారం దురదృష్టకరం: హర్షవర్దన్‌

కొవిడ్‌-19 టీకాలు సురక్షితమేనని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ సమావేశంలో వెల్లడించారు. ‘దేశంలో వినియోగానికి అనుమతి పొందిన కొవిడ్‌-19 టీకాలు సురక్షితమే. అవి కరోనా వైరస్‌ వ్యాధిపై ప్రభావవంతంగా పనిచేస్తాయని ఇప్పటికే నిరూపితమయ్యాయి.

Published : 21 Jan 2021 21:56 IST

దిల్లీ: కొవిడ్‌-19 టీకాలు సురక్షితమేనని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ సమావేశంలో వెల్లడించారు. ‘దేశంలో వినియోగానికి అనుమతి పొందిన కొవిడ్‌-19 టీకాలు సురక్షితమే. అవి కరోనా వైరస్‌ వ్యాధిపై ప్రభావవంతంగా పనిచేస్తాయని ఇప్పటికే నిరూపితమయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ దాదాపు 8లక్షల మంది టీకాలు తీసుకున్నారు. అక్కడక్కడా కొందరిలో ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. ఏ టీకా వేయించుకన్నా కొంతమందిలో స్వల్ప ప్రతికూల ప్రభావాలు కనిపించడమనేది సర్వసాధారణమైన విషయం. శాస్త్రీయంగా పరిశీలించి, హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించిన తర్వాతే ఈ టీకాలకు నియంత్రణ సంస్థల గుర్తింపు లభించింది. ఇప్పటికే పలు దేశాలు టీకా ఎగుమతి చేయాలంటూ భారత్‌ను సంప్రదిస్తున్నాయి’ అని హర్షవర్దన్‌ తెలిపారు. 

టీకాలపై తప్పుడు ప్రచారాల గురించి స్పందిస్తూ.. అలాంటి ప్రచారాలపై మనం దీటుగా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘గతంలో పోలియో, అమ్మోరు (చికెన్‌ పాక్స్‌) వంటి వ్యాధులు ప్రబలిన సమయంలోనూ టీకాలే కీలక పాత్ర పోషించాయి. టీకాల కారణంగానే ఆయా వ్యాధులను అరికట్టగలిగాం. కానీ ఇప్పుడు కొందరు వ్యక్తులు ప్రజల్లో కొవిడ్‌-19 టీకాలపై విరక్తిని సృష్టించేందుకు.. దుష్ప్రచారం చేయడం ఎంతో దురదృష్టకరం. భారత్‌ కరోనా వైరస్‌ మహమ్మారిపై విజయవంతంగా పోరాటం చేసింది’ అని హర్షవర్దన్‌ పేర్కొన్నారు. దేశంలో బుధవారం సాయంత్రం నాటికి 7.86లక్షల మందికి టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఐదో రోజున వ్యాక్సినేషన్‌లో ప్రతికూల ప్రభావాలకు సంబంధించి 82 కేసులు కనిపించినట్లు తెలిపింది. 

ఇదీ చదవండి

టీకా వేయించుకోనున్న ప్రధాని మోదీ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని