సెప్టెంబర్‌కు మరో టీకా తేనున్నాం: సీరం

తమ సంస్థ నుంచి మరో టీకాను తీసుకువచ్చేందుకు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది.

Published : 27 Mar 2021 19:57 IST

కొవావాక్స్‌కు భారత్‌లో ట్రయల్స్ ప్రారంభం

దిల్లీ: తమ సంస్థ నుంచి మరో టీకాను తీసుకువచ్చేందుకు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన నొవావాక్స్ అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కొవావ్యాక్స్‌’కు శనివారం క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని సీరం సీఈఓ అదర్ పూనావాలా ట్విటర్ వేదికగా వెల్లడించారు. కొవావ్యాక్స్ టీకాను మనదేశంలో తయారు చేసేందుకు నొవావాక్స్‌తో ఇంతకు ముందే సీరం సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దానిలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. 

‘భారత్‌లో కొవావ్యాక్స్ టీకాకు క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. నొవావ్యాక్స్, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఈ టీకాను అభివృద్ధి చేశాం. కొవిడ్‌-19 కొత్త రకాలైన యూకే, దక్షిణాఫ్రికా వైరస్‌లపై దానిని పరీక్షించాం. ఈ టీకా సమర్థత 89శాతంగా వెల్లడైంది. సెప్టెంబర్ 2021 నాటికి ఈ టీకాను అందుబాటులోకి తీసుకురాగలమని ఆశిస్తున్నాం’ అని అదర్ పూనావాలా ట్వీట్ చేశారు. 

గతంలో జూన్‌లో ఈ కొత్త టీకాను అందుబాటులోకి తీసుకురావాలని అదర్ భావించారు. ఇప్పుడు ఆ లక్ష్యం సెప్టెంబర్‌కు మారింది. మరోవైపు, యూకేలో నిర్వహించిన ట్రయల్స్‌లో కొవావ్యాక్స్‌కు 89.3 శాతం ప్రభావశీలత ఉన్నట్లు స్పష్టమైంది. అమెరికా, మెక్సికో దేశాల్లో దీనిపై ప్రస్తుతం మూడో దశ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక, ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాను మనదేశంలో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. దాంతో పాటు, కొవాగ్జిన్ టీకాకు కొద్ది నెలల క్రితం భారత ప్రభుత్వం అత్యవసర వినియోగం కింద అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం నడుస్తోన్న కరోనా టీకా కార్యక్రమం కింద కేంద్రం ఈ రెండింటిని ప్రాధాన్య సమూహాలకు పంపిణీ చేస్తోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని