PM Modi: ‘ఆవు’ మాకు పవిత్రం.. వాళ్లకు పాపం: మోదీ వ్యాఖ్యలు

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ యూపీలో విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యూపీలో భాజపా ప్రభుత్వం ఆవుల పెంపకానికి .....

Updated : 23 Dec 2021 17:15 IST

వారణాసి: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ యూపీలో విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యూపీలో ఆవుల పోషణకు తాము గర్వపడుతుండగా.. కొందరు దాన్నో పాపంగా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. కోట్లాది మంది ప్రజలు పశుసంపదపై ఆధారపడి జీవిస్తున్నారన్న విషయాన్ని మరచిపోయి ఆవులు, గేదెలపై జోక్‌లు వేస్తున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. గురువారం ప్రధాని మోదీ వారణాసిలోని డెయిరీ, విద్య, ఆరోగ్యం వంటి 22 అభివృద్ధి ప్రాజెక్టులకు  శంకుస్థాపన చేశారు. ఈరోజు ఉదయం తన నియోజకవర్గమైన వారణాసికి విచ్చేసిన మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. డెయిరీ రంగంపై యోగి ప్రభుత్వం ఎక్కువ దృష్టిపెట్టిందన్నారు.

గత ఆరేడు సంవత్సరాలతో పోలిస్తే భారతదేశంలో పాల ఉత్పత్తి 45శాతం పెరిగిందన్నారు. ఈరోజు ప్రపంచ పాల ఉత్పత్తిలో 22శాతం భారత్‌దేనన్నారు. మన దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌ అధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రంగానే కాకుండా డెయిరీ రంగాన్ని విస్తరిస్తున్న రాష్ట్రంగా నిలుస్తున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు. దేశంలో కోట్లాది మంది ఆధారపడి జీవిస్తున్న గోవు తమకు అమ్మలాంటిదని, ఎంతో పవిత్రంగా భావిస్తామన్నారు. సమాజ్‌వాదీ పార్టీని మాఫియావాద్‌, పరివార్‌వాద్‌ అని మండిపడిన ప్రధాని.. సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌కే తమ ప్రాధాన్యమని చెప్పారు. యూపీ, కాశీలలో డబుల్ ఇంజిన్‌ అభివృద్ధి గురించి తాను మాట్లాడుతుంటే కొందరు బాధపడుతున్నారని, వాళ్లంతా యూపీ రాజకీయాలను కేవలం కులం, మతం, మత భేదాలతో చూసినవారేనని ఆరోపించారు. 

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని