వ్యాక్సిన్‌ పంపిణీలో కీలకంగా ‘కో-విన్‌’

ప్రపంచంలోనే భారీ ఎత్తున చేపడుతోన్న కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమంలో ‘కో-విన్’‌ యాప్‌ కీలకంగా ఉండనుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది

Published : 10 Jan 2021 23:42 IST

రాష్ట్రాల అధికారులతో కేంద్ర బృందం సమావేశం

దిల్లీ: ప్రపంచంలోనే భారీ ఎత్తున భారత్‌ చేపడుతోన్న కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమంలో ‘కో-విన్’‌ యాప్‌ కీలకంగా ఉండనుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. చిట్టచివరి వ్యాక్సిన్‌ పంపిణీ కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారానే జరుగుతుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ వెల్లడించింది. వ్యాక్సిన్‌పై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందానికి నేతృత్వం వహిస్తోన్న రామ్‌ సేవాక్‌ శర్మ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యింది. జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లపై ఈ బృందం రాష్ట్రాలకు తగు సూచనలను చేసింది.

దేశంలో వ్యాక్సిన్‌ తీసుకునే ప్రతి ఒక్కరి వివరాలను ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారానే నివేదించాలని నిపుణుల బృందం రాష్ట్రాలకు సూచించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తి వివరాలు, ఆయనకు ఎవరు వ్యాక్సిన్‌ ఇచ్చారు, ఏ సంస్థకు చెందిన వ్యాక్సిన్‌ను ఇచ్చారనే విషయాల డిజిటల్‌ రికార్డును ఈ సాఫ్ట్‌వేర్‌లో కచ్చితంగా పొందుపరచాలని స్పష్టంచేసింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారి వివరాలను కూడా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. అయితే, వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యంతో ఈ సాఫ్ట్‌వేర్‌ తయారు చేశామని, ఏ సమయంలోనైనా, ఎక్కడైనా వ్యాక్సిన్ దొరుకుతుందని పౌరులకు తెలియజేసే విధంగా దీన్ని రూపొందించామని పేర్కొంది. అయితే, వ్యాక్సిన్‌ సమాచారం పొందుపరిచే సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా వీటిని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో కూడా చేసుకోవచ్చని అధికారులకు సూచించింది. సమాచారాన్ని పంపించడంలో ఆలస్యాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించమని స్పష్టంచేసింది.

వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో మొబైల్‌ నెంబర్‌, ఆధార్‌ను నమోదుచేసుకునేలా ఆయా రాష్ట్రాలు ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తిచేసింది. తద్వారా ఎటువంటి సమస్యలు లేకుండా వారి మొబైల్‌ నెంబర్‌కే వ్యాక్సిన్‌ గురించిన సమాచారం అందుతుందని పేర్కొంది. అంతేకాకుండా సాఫ్టవేర్‌పై అభిప్రాయాలు, చేయాల్సిన మార్పులపైనా రాష్ట్రాలనుంచి సలహాలు/ సూచనలను తీసుకుంది.

ఇవీ చదవండి..
కోవిన్‌ యాప్‌ ద్వారానే టీకా పంపిణీ..!
ఏ టీకా పవరెంతా..?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని