Mamata Banerjee: పారిశ్రామికసంస్థలను నేను వెళ్లగొట్టలేదు: మమతా బెనర్జీ

సీపీఎం పార్టీ బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ సింగూర్‌లో ఉద్యమం జరిగిందని, దానివల్లే టాటా కంపెనీ బెంగాల్‌ నుంచి వెళ్లిపోయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

Updated : 20 Oct 2022 10:19 IST

సిల్‌గురి: పశ్చిమ బెంగాల్‌ నుంచి టాటా మోటార్స్‌ కంపెనీని తాను వెళ్లగొట్టలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నాటి సీపీఎం ప్రభుత్వం వల్లే కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందని ఆరోపించింది. సిలిగుడిలో బహిరంగ సభలో పాల్గొన్న దీదీ.. 2000 నాటి ఘటన గురించి ప్రస్తావించారు.

‘‘పశ్చిమ బెంగాల్‌ నుంచి టాటాలను నేనే వెళ్లగొట్టానని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ నేను వారిని వెళ్లగొట్టలేదు. సీపీఎం కారణంగానే ఆ కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లిపోయింది. ఆ ప్రాజెక్టు కోసం సీపీఎం పార్టీ ప్రజల నుంచి బలవంతంగా భూములు తీసుకుంది. వాటిని మేం తిరిగి ప్రజలకు ఇప్పించేలా పోరాడాం. మేం కూడా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించాం. కానీ ఏనాడూ ప్రజల నుంచి బలవంతంగా భూములు లాగేసుకోలేదు. ఇక్కడ భూముల కొరత లేనప్పుడు ఎందుకు బలవంతంగా తీసుకోవాల్సి వచ్చింది?’’ మమత అన్నారు. బెంగాల్‌లో పారిశ్రామికవేత్తల పట్ల ఎలాంటి వివక్ష ఉండదని, ఎవరైనా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చని తెలిపారు.

టాటా మోటార్స్‌ తీసుకొచ్చిన చౌక కారు నానో తయారీ యూనిట్‌ను ఆ సంస్థ అప్పట్లో బెంగాల్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని భావించింది. ఈ ప్రాజెక్టు కోసం అప్పటి సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం.. సింగూర్‌లో దాదాపు 1000 ఎకరాల మేర వ్యవసాయ భూమిని సేకరించింది. అయితే ఈ భూసేకరణకు వ్యతిరేకంగా సింగూర్‌, నందిగ్రామ్‌లో అప్పట్లో పెద్ద ఉద్యమమే జరిగింది. దీంతో టాటా తమ తయారీ యూనిట్‌ను గుజరాత్‌లోని సనంద్‌లో ఏర్పాటు చేసింది. ఈ ఉద్యమంలో దీదీ నేతృత్వంలోని టీఎంసీ కీలక పాత్ర పోషించింది. 34ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వామపక్షాలను గద్దెదించి 2011లో మమత అధికారంలోకి రావడానికి ఈ ఉద్యమం ఎంతగానో దోహదపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని