Kashmir: నిషేధిత సంస్థ ‘జమాతే’కు చెందిన రూ.90 కోట్ల ఆస్తులు స్వాధీనం

నిషేధిత సంస్థ ‘జమాతే ఇస్లామీ’కు భారీగా ఆస్తులు ఉన్నట్లు స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎస్‌ఐఏ) గుర్తించింది. ఇప్పుడు వాటి స్వాధీనంపై దృష్టిపెట్టింది.

Published : 27 Nov 2022 12:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నిషేధిత సంస్థ ‘జమాతే ఇస్లామీ’ ఆస్తులపై స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎస్‌ఐఏ) దృష్టిపెట్టింది. ఆ సంస్థకు జమ్ము-కశ్మీర్‌లో ఉన్న దాదాపు 200 ఆస్తులను ఇప్పటికే గుర్తించింది. అనంత్‌నాగ్‌ జిల్లాలో ఆ సంస్థకు సంబంధించిన 11 ప్రధాన ఆస్తులను సీజ్‌ చేసింది. వీటి విలువ సుమారు రూ.90 కోట్లు ఉంటుందని అంచనా. ఆ రాష్ట్రంలో ఉగ్రవాదం, వేర్పాటు వాదాలను జమాతే ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఆస్తులపై ఎస్‌ఐఏ ఆపరేషన్‌ చేపట్టింది. శనివారం భారీ ఎత్తున పోలీసు దళాల సాయంతో దాడులు చేసింది. స్వాధీనం చేసుకొన్న ఆస్తుల్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. 

ఈ నెల మొదట్లో షోపియాన్‌ జిల్లాలో జమాతేకు చెందిన తొమ్మిది ఆస్తులను గుర్తించి సీజ్‌ చేశారు. వీటిల్లో రెండు పాఠశాల భవనాలు కూడా ఉన్నాయి. యూఏపీఏ, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద ఈ ఆస్తులను జిల్లా న్యాయమూర్తి నోటిఫై చేశారు. ఇక రాష్ట్రంలో జమాతే ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని ఎస్‌ఐఏ అధికారులు చెబుతున్నారు. 

జమ్ము కశ్మీర్‌లో జమాతే ఇస్లామీ అతిపెద్ద రాజకీయ-మతపరమైన సంస్థ. 2019లో దీనిపై నిషేధం విధించడానికి ముందు వరకు భారీగా పాఠశాలల నెట్‌వర్క్‌ను నిర్వహించేది. ఈ సంస్థ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. కశ్మీరీ ఉగ్రసంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ భావజాలానికి ములసంస్థగా జమాతేకు పేరుంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదానికి నిధులను అందకుండా చేయడం కోసం జమాతేపై స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ దృష్టిపెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని