Uttarakhand: వందలాది ఇళ్లకు పగుళ్లు.. భయాందోళనలో ప్రజలు..!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్‌ ప్రజలు భయంతో బతుకుతున్నారు. ఇళ్లకు పగుళ్లు రావడంతో వారు సొంతూరును ఖాళీ చేయాల్సి వస్తోంది. 

Updated : 05 Jan 2023 16:55 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ ప్రాంతం ప్రజలు కొద్దిరోజులుగా బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. భూమి కుంగిపోవడంతో అక్కడి వందలాది ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. దాంతో వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దాదాపు 60 కుటుంబాలు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేశాయని సమాచారం.

ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో 500 కుటుంబాలు ఆ ఇళ్లలోనే నివస్తున్నాయి. 29 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  అక్కడి రహదారుల మీద ఈ తరహా పగుళ్లు కనిపిస్తున్నాయి.  జోషిమఠ్‌లోని తొమ్మిది వార్డుల్లో ఈ సమస్య ఉంది. కొన్నిచోట్ల కింది నుంచి నీళ్లు ఉబికివస్తున్న కేసులు వెలుగులోకి వచ్చాయని విపత్తు ప్రతిస్పందన విభాగం గుర్తించింది. దీనికి గల కారణాలను గుర్తించే పనిని రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రవేత్తలు, నిపుణులకు అప్పగించింది. వారు నివేదికను సిద్ధం చేసి, ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు. 

ఈ అనూహ్య పరిణామంపై ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్ ధామి స్పందించారు. ‘నేను జోషిమఠ్‌కు వెళ్లి, అక్కడి అధికారులకు తగిన సూచనలు చేస్తాను. అన్ని నివేదికలు పరిశీలించిన మీదట తగ్గ చర్యలు చేపడతాం. ఇప్పటికే దీనిపై స్థానిక అధికారులతో మాట్లాడాను’అని వెల్లడించారు. ఇక భయాందోళనకు  గురైన బాధితులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. తమకు ఈ పరిస్థితి తలెత్తడానికి ఇక్కడున్న విద్యుత్ ప్రాజెక్టే కారణమని టార్చ్‌లు పట్టుకొని ఆందోళన చేపడుతున్నారు. విపత్తు ప్రతిస్పందన  విభాగం, మున్సిపల్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.     


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని