
Crime News: ఏకంగా రైలు ఇంజిన్‌నే అమ్మేశాడు
రైలు ఇంజిన్ పరికరాలు
రైల్వే శాఖలో ఇంజినీర్‌గా పనిచేసే ఓ వ్యక్తి.. ఏకంగా రైలు ఇంజిన్‌పైనే కన్నేశాడు. అతని కుటిల బుద్ధికి.. ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్, సహాయకుడు తోడయ్యారు. ఇంకేముంది గుట్టుచప్పుడు కాకుండా రైలు ఇంజిన్‌ను పాతసామాన్లు కొనే మాఫియాకు అమ్మేశారు. బిహార్‌లోని పుర్ణియా కోర్ట్ రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న సమస్తీపుర్ లోకో డీజిల్ షెడ్‌లో రాజీవ్ రంజన్ ఝా ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. పుర్ణియా స్టేషన్‌లో చిన్నరైల్వే ట్రాక్‌పై తిరిగే ఓ పాత రైలు ఇంజిన్ ఉంది. దానిని అమ్మేయాలని భావించిన ఝా నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి.. అవి పైఅధికారుల నుంచి వచ్చినట్లుగా నమ్మించాడు. అనంతరం పాత సామాను కొనుగోలు చేసే ఓ మాఫియాకు అమ్మేశాడు. ఈ వ్యవహారంలో రాజీవ్‌కు స్థానికంగా పనిచేసే పోలీస్ ఇన్‌స్పెక్టర్ వీరేంద్ర ద్వివేది, సహాయకుడు తోడ్పాటు అందించారు. డిసెంబరు 14న రాజీవ్.. హెల్పర్ సాయంతో గ్యాస్ కట్టర్‌తో రైలు ఇంజిన్‌ను ముక్కలు చేస్తూ కనిపించారు. అక్కడున్న కొంతమంది అధికారులు దానిని అడ్డుకోగా నకిలీ ధ్రువపత్రాలను చూపించాడు. అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు వారు సమాచారం అందించారు. తమ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెప్పారు. దీంతో ఆర్‌పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేపట్టగా నిజం వెలుగులోకి వచ్చింది. రాజీవ్, వీరేంద్రతోపాటు వారికి సహకరించిన హెల్పర్‌ను సస్పెండ్ చేశారు.
Advertisement