Criminal Escape: భక్తితో కళ్లు మూసుకున్న పోలీసులు.. తుర్రుమన్న నిందితుడు

నిబంధనలు అతిక్రమించి పోలీసులు దైవదర్శనానికి వెళ్లడంతో.. హత్య కేసులో నిందితుడు తప్పించుకు పారిపోయాడు. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 20 Jun 2024 17:44 IST

వడోదర: పోలీసుల నిర్లక్ష్యంతో ఓ నిందితుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. కోర్టు విచారణ తర్వాత పోలీసులు నేరుగా జైలుకు తరలించడం మానేసి.. మధ్యలో దైవదర్శనం కోసం ఆగడంతో.. ఇదే అదునుగా భావించి నిందితుడు పరారయ్యాడు. మంగళవారం గుజరాత్‌లో (Gujarat) చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం కేసులో నిందితులుగా ఉన్నవారిని జైలు లేదా పోలీస్‌స్టేషన్‌ నుంచి నేరుగా కోర్టుకు తీసుకెళ్లి విచారణ పూర్తయిన తర్వాత భద్రత నడుమ మళ్లీ జైలుకు తీసుకు రావాల్సి ఉంటుంది.

అయితే, మధ్యప్రదేశ్‌లోని మంద్‌సర్‌ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న దశరథ్‌ జాట్‌ను విచారణ కోసం గుజరాత్‌లోని హలోల్‌ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. విచారణ పూర్తయిన తర్వాత తిరుగు పయనంలో దగ్గరల్లోని పవగధ్‌ మహాకాళి దర్శనం కోసం ఆగారు. కొంత దూరంలో ఉన్న రోప్‌ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకొని నిందితుడితో సహా నడుచుకుంటూ వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దశరథ్‌.. పోలీసుల కళ్లు కప్పి భక్తుల్లో కలిసిపోయి తప్పించుకున్నాడు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో..పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు నిబంధనలను అతిక్రమించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ నలుగురు పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. గుజరాత్‌లో మాదక ద్రవ్యాల రవాణాపై 2022లో దశరథ్‌పై కేసు నమోదైంది. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. తాజాగా ఓ వ్యక్తిని హత్య చేశాడన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే అతడు వాంటెడ్‌ జాబితాలో ఉండటంతో గుజరాత్‌లోని హలోల్‌ కోర్టులో హాజరు పరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని