హస్తంలో గెలుపు రేఖ అదృశ్యం..!

కాంగ్రెస్‌.. భారత్‌లో 130 ఏళ్ల చరిత్రతో ‘ది గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ’గా ఒక వెలుగు వెలిగింది. కానీ, ఇప్పుడా పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. పార్టీలో నెలకొన్న నాయకత్వ

Published : 11 Mar 2022 01:30 IST

 ఆగని ఓటముల పరంపర..! 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ‘ది గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ’గా ఒక వెలుగు వెలిగింది. కానీ, ఇప్పుడా పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. పార్టీలో నెలకొన్న నాయకత్వ, వ్యవస్థీకృత లోపాలు వెరసి దానిని ఓటముల ఊబిలోకి నెడుతున్నాయి. అందివచ్చిన యువ నాయకులను.. అనుభవం ఉన్న సీనియర్లనూ చేజేతులారా వదులుకొంటోంది. చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు పొత్తులకు కూడా కాంగ్రెస్‌ వైపు చూడని పరిస్థితి నెలకొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా ఆ పార్టీ నాయకుల్లో, కేడర్‌లో తీవ్ర నిర్వేదం నెలకొంటోంది. దీంతో జెండా మోసే కార్యకర్తలకు దిక్సూచి కరవుతోంది. అన్ని వెరసి తాజా ఎన్నికల తర్వాత కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం అయింది. మరోవైపు ఒక్క రాష్ట్రంతో అధికార ప్రస్థానం మొదలు పెట్టిన ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్‌లో విజయంతో రెండో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకొంది.

నాయకత్వం చేపట్టరు.. అవకాశం ఇవ్వరు..

కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం గాంధీల కుటుంబంతో పెనవేసుకుపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపడితే ఆ కుటుంబం వారే చేపట్టాలనే పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల తర్వాత రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని వదులుకొన్నారు. దీంతో తిరిగి ఆ పదవి సోనియాగాంధీ చేతికే వెళ్లింది. కానీ, పార్టీలో రాహుల్‌ మాట వేదవాక్కుగా చలామణి అవుతోంది. ప్రశాంత్‌ కిశోర్‌ వంటి ఎన్నికల వ్యూహకర్తలు ఇటువంటి వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుబట్టారు.  ‘‘బలమైన ప్రతిపక్షం ఉండాలంటే కాంగ్రెస్‌ సిద్ధాంతాలు, ఉనికి చాలా అవసరం. అయితే కాంగ్రెస్‌ నాయకత్వం ఒక వ్యక్తికి ఉన్న ‘దైవదత్త హక్కు’ ఏమీ కాదు. గత పదేళ్లలో 90 శాతం ఎన్నికలు ఓడిపోయిన దృష్ట్యా ఇలాంటి హక్కు ఉందని భావించలేరు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్ష నాయకత్వాన్ని నిర్ణయించుకోవాలి’’ అంటూ హితవు పలికారు. ఆ సమయంలో ఆయనపై కాంగ్రెస్‌ నాయకులు విమర్శలు గుప్పించారు. తర్వాత పరిస్థితి షరా మాములే..! ఇక పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న గులాంనబీ ఆజాద్‌ కూడా గత నెల మాట్లాడుతూ.. ‘‘నాయకుడి తర్వాత నాయకుడు పార్టీని వీడుతున్నారు.. ఇది ఆందోళనకరం’’ అంటూ వ్యాఖ్యానించారు. 2020లో ఏకంగా పార్టీకి చెందిన ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు, నాటి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు పార్టీని ఆమూలాగ్రం ప్రక్షాళన చేయాలని లేఖ రాశారు. ఫలితం.. ఆ లేఖరాసిన 23 మందిని జీ-23 పేరిట వేరుగా చూడటం మొదలుపెట్టారు. కొందరికి వర్కింగ్‌ కమిటీలో సీట్ల గల్లంతయ్యాయి. 

పార్టీని వీడుతున్న ప్రజాదరణ ఉన్న నాయకులు..

మంచి వాగ్ధాటి.. ప్రజాదరణ ఉన్న నాయకులు క్రమంగా కాంగ్రెస్‌ వీడుతున్నారు. ఇటీవల కాలంలో చూస్తే.. రాహుల్‌ సన్నిహిత వర్గంలోని వ్యక్తిగా పేరున్న జ్యోతిరాదిత్య సింధియా కూడా కమలం కండువా కప్పుకొన్నారు. నాయకత్వం సింధియాను పరిగణనలోకి తీసుకోకుండా.. వృద్ధనేత కమల్‌నాథ్‌కు ప్రాధాన్యమివ్వడంతో పాటు సీఎంగా పగ్గాలు అప్పగించడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇటువంటి ఘటనలు పార్టీ కేడర్‌కు ఎటువంటి సందేశాన్ని పంపుతాయని హస్తం నాయకత్వం పెద్దగా పట్టించుకొన్నట్లు లేదు. 

* ప్రస్తుత అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా 1991-2015 వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగిన వ్యక్తి. చివరకు పార్టీని వీడి కమలం కండువాకప్పుకొని ఏకంగా అసోం ముఖ్యమంత్రి అయ్యారు. 

* మెహువా మొయిత్రి వంటి ప్రతిభావంతురాలు రాహుల్‌ గాంధీ ప్రాజెక్ట్‌ ఆమ్‌ ఆద్మీ సిపాయిలో పనిచేశారు. జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో కీలక పదవిని వీడి రాజకీయాల్లోకి వచ్చిన ప్రతిభావంతురాలామె. కానీ, కాంగ్రెస్‌లో అవకాశాలు లభించక పార్టీని వీడి తృణముల్‌లో చేరి తనను తాను నిరూపించుకొన్నారు. ఇప్పుడు లోక్‌సభలో టీఎంసీ గళం బలంగా వినిపిస్తున్న నేతగా ఆమె నిలిచారు. 

* తాజాగా పంజాబ్‌ ఎన్నికలు దీనికి మంచి ఉదాహరణ. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూలో కాంగ్రెస్‌ నాయకత్వానికి ఏమి ప్రజాకర్షణ కనిపించిందో ఏమో.. గత ఎన్నికల్లో అన్ని తానై  పార్టీని నడిపించిన అమరీందర్‌ సింగ్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లో బయటకు సాగనంపింది. చన్నీని తీసుకొచ్చి సీఎం పీఠంపై కూర్చొబెట్టింది. సిద్ధూ-చన్నీ పోరు కారణంగా కాంగ్రెస్‌ అవకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోపక్క పార్టీని వీడిన అమరీందర్‌ విజయం సాధించలేదు.. అటు కాంగ్రెస్‌ గెలవలేదు. వాస్తవానికి రైతు ఉద్యమాన్ని వెనుకుండి నడిపించి విజయం సాధించేలా చేసింది అమరీందరే. చివరికి ఆ విజయం ఎవరికీ కాకుండా పోయింది.  

* రాజస్థాన్‌ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన సచిన్‌ పైలట్‌ను ఫలితాలు వచ్చిన తర్వాత పక్కనపెట్టారు. తిరిగి వృద్ధనేత అశోక్‌ గహ్లోత్‌కు అవకాశం ఇచ్చారు. సచిన్‌ కొన్నాళ్లపాటు పార్టీలో అవమానాలకు గురై చివరికి రాజీనామా వరకు వెళ్లాల్సి వచ్చింది. పరిస్థితి చేజారుతుందని భావించిన అధినాయకత్వం జోక్యం చేసుకోవడంతో ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. ఇవన్నీ పార్టీ కోసం శ్రమించే నేతలకు తప్పుడు సంకేతాలు పంపుతాయనే విషయాన్ని మాత్రం హస్తం నేతలు విస్మరించారు.

* పార్టీ ట్రబుల్‌షూటర్లుగా పేరున్న ప్రణబ్‌ముఖర్జీ, అహ్మద్‌ పటేల్‌ వంటి ఉద్ధండుల మరణంతో కాంగ్రెస్‌లో ఏర్పడ్డ శూన్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రాంతీయ పార్టీలు కూడా దూరం..

ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్షంగా భావించే పరిస్థితులు మారిపోయాయి. దేశంలోని అతికొద్ది రాష్ట్రాల్లో తప్ప మిగిలిన చోట్ల ప్రధాన ప్రతిపక్షం అన్న పరిస్థితి లేదు. మహారాష్ట్ర ప్రభుత్వంలో కానీ, తమిళనాడు ప్రభుత్వంలో కానీ, కాంగ్రెస్‌ పాత్రను చూస్తే ఇది అర్థమైపోతుంది. ఇటీవల కాలంలో ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్‌ను ప్రధాన శక్తిగా పెట్టుకొని 2024 ఎన్నికలకు వెళ్లేలా ఏమి కనిపించడంలేదు. ఈ సారి యూపీ ఎన్నికలను పరిశీలిస్తే ఈసారి ఎస్పీ, బీఎస్పీ కూడా కాంగ్రెస్‌తో పొత్తుకు దూరంగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు, భాజపా బలపడుతూ.. కాంగ్రెస్‌ ఓటింగ్‌ శాతం తగ్గుతోందంటే.. ఏం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు కేంద్రంలో మతతత్వ పార్టీగా విమర్శల పాలైన భాజపాను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ను నేతృత్వంలో రాజకీయ పార్టీలు పనిచేశాయి. కానీ, ఇప్పుడు మెల్లగా పరిస్థితి మారింది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్‌, కేసీఆర్‌ వంటి వారు మోదీ-షా ద్వయం ఎత్తులను ఎదుర్కొనేందుకు స్వశక్తినే నమ్ముకొన్నారు. అవసరమైతే వీరంతా జట్టుకట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. వీరితో తాజాగా కేజ్రీవాల్‌ కూడా కలిసే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని