
Crop stubble burning: ‘దిల్లీ’ ఊపిరి పీల్చుకునే వార్త.. తగ్గిన పంట వ్యర్థాల దహనం కేసులు
దిల్లీ: దిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకునే వార్త! ఏటా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లో వరి పంట వ్యర్థాల దహనం పెద్దఎత్తున సాగుతుండటం తెలిసిందే. ఫలితంగా తీవ్ర వాయు కాలుష్యంతో దేశ రాజధాని దిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం పంజాబ్, హరియాణాతోపాటు దేశ రాజధాని పరిధి(ఎన్‌సీఆర్)లోకి వచ్చే యూపీలోని ఎనిమిది జిల్లాల్లో పంట వ్యర్థాలను కాల్చడం గణనీయంగా తగ్గినట్లు తేలింది. గతేడాది సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 14 మధ్యలో 4,854 ఈ తరహా కేసులు వెలుగుచూడగా, ఈ ఏడాది కేవలం 1,795 మాత్రమే నమోదయ్యాయని ‘ది కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్(సీఏక్యూఎం)’ శుక్రవారం వెల్లడించింది. ఇందులోని 663 ప్రాంతాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేసినట్లు తెలిపింది. ఇస్రో ప్రొటోకాల్స్ మేరకు రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. ఈ తరహా కేసులు పంజాబ్‌లో ఈసారి 69.49 శాతం, హరియాణాలో 18.28 శాతం, యూపీలో 47.61 శాతం తగ్గడం విశేషం.
‘పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి’
‘రాబోయే కొద్ది వారాల్లో పంట కోతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. మరోవైపు పంట వ్యర్థాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కార్యాచరణ ప్రణాళిక కింద పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి’ అని సీఏక్యూఎం ఈ సందర్భంగా వెల్లడించింది. వాయు కాలుష్యాన్ని అరికట్టే క్రమంలో.. పంజాబ్, హరియాణాతోపాటు ఎన్‌సీఆర్ పరిధిలోకి వచ్చే యూపీలోని ఎనిమిది జిల్లాల్లో వరి పంట వ్యర్థాలను కాల్చే ఘటనలను సీఏక్యూఎం ఏటా పర్యవేక్షిస్తుంటుంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ.. తగు సూచనలు జారీ చేస్తుంది. మరోవైపు దిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహాలను అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే సరి-బేసి విధానం సహా పలు చర్యలను చేపట్టిన అక్కడి ప్రభుత్వం.. తాజాగా ‘వింటర్ యాక్షన్ ప్లాన్’ పేరిట 10 పాయింట్ల ప్రణాళికను ప్రకటించింది.