Amarnath Yatra: ‘అమర్‌నాథ్‌ యాత్ర’పై ఉగ్ర కుట్ర.. రహస్య సొరంగం గుర్తింపు

త్వరలోనే జరగబోయే వార్షిక అమరనాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు చేసిన కుట్రను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది భగ్నం చేశారు

Updated : 05 May 2022 15:44 IST

జమ్మూ: త్వరలోనే జరగబోయే వార్షిక అమరనాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు చేసిన కుట్రను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది భగ్నం చేశారు. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ రహస్య సొరంగాన్ని గుర్తించారు. సాంబా జిల్లాలోని చాక్‌ ఫఖీరా బోర్డర్‌ అవుట్‌పోస్ట్‌కు సమీపంలోని 150 మీటర్ల సొరంగం ఉన్నట్లు గుర్తించామని బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

ఈ సొరంగాన్ని ఇటీవలే తవ్వారని, పాక్‌ భూభాగం నుంచే ఈ సొరంగం ఉన్నట్లు బీఎస్‌ఎఫ్‌ డీఐజీ ఎస్‌పీఎస్‌ సంధు తెలిపారు. అవుట్‌పోస్ట్‌కు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఇది ఉన్నట్లు తెలిపారు. ఈ సొరంగం నుంచి భారత్‌లోని చివరి గ్రామానికి దూరం కేవలం 700 మీటర్లేనని చెప్పారు. అమర్‌నాథ్‌ యాత్రకు భంగం కలిగించేందుకు ముష్కరులు ఈ సొరంగం నుంచి భారత భూభాగంలోకి చొరబడేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

గత నెల జమ్మూలోని సుంజ్వాన్‌ ప్రాంతంలో సీఐఎస్‌ఎఫ్‌ బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఈ టన్నెల్‌ను గుర్తించారు.

కశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉండే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది అమర్‌నాథ్ యాత్ర చేపడుతారు. అయితే, ఈ యాత్రకు ఉగ్రవాదులు ముప్పు పొంచి ఉన్నట్లు ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉంటాయి. 2017లో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌ 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని