
saudi Crown Prince: ‘నాటి రాజు హత్యకు ఎంబీఎస్ యత్నం’..!
సౌదీ మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుత సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్)పై ఓ మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. నాటి రాజు అబ్దుల్లాను బిన్ సల్మాన్ చంపాలనుకున్నట్లు సాద్ అల్ జబ్రి అనే మాజీ సీనియర్ సౌదీ సెక్యూరిటీ ఉద్యోగి పేర్కొన్నాడు. సాద్ గతంలో సౌదీ తరపున అమెరికా యాంటీ టెర్రర్ ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు.
సాద్ కథనం ప్రకారం.. 2014లో బిన్ సల్మాన్‌కు సౌదీ ప్రభుత్వంలో ఎటువంటి పదవీ ఇవ్వలేదు. ఆ సమయంలో అతని తండ్రి సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ యువరాజుగా (క్రౌన్‌ప్రిన్స్)గా ఉండేవారు. అయినా కూడా ఎంబీఎస్‌కు న్యాయస్థానంలో గేటు కీపర్‌గా ఉండాల్సి వచ్చింది. దీంతో ఎంబీఎస్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. అదే ఏడాది తన సోదరుడు, నాటి ఇంటీరియర్ మినిస్టర్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ నయీఫ్తో ఎంబీఎస్ భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా ఎంబీఎస్ మాట్లాడుతూ రష్యా నుంచి విషపూరిత ఉంగరం తెప్పించి రాజు అబ్దుల్లాని చంపాలనుందని అన్నాడు. కేవలం ఒక్కసారి రాజు అబ్దుల్లాకి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు ఆ తర్వాత విష ప్రభావంతో రాజు చనిపోతాడని.. అప్పుడు తన తండ్రి సల్మాన్ బిన్ అబ్దులజీజ్ రాజు అవుతాడని వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని సౌదీ ఇంటెలిజెన్స్ తీవ్రంగా పరిగణించింది. ఆ తర్వాత రాజకుటుంబలో వివాదాన్ని పరిష్కరించారు.
ఎంబీఎస్-నయీఫ్ భేటీకి సంబంధించిన వీడియో తన వద్ద ఉందని సాద్ పేర్కొన్నాడు. తన ప్రాణాలకు హాని జరిగితే ఆ వీడియోను విడుదల చేస్తానని పేర్కొన్నాడు. 2015 కింగ్ అబ్దుల్లా సహజ కారణాలతో మరణించారు. ఆ తర్వాత సల్మాన్ బిన్ అబ్దులజీజ్ రాజుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత క్రౌన్ ప్రిన్స్ అయిన నయీఫ్‌ను 2017లో పక్కకు తప్పించి బిన్ సల్మాన్ ఆ పదవిలోకి వచ్చాడు. నాటి నుంచి సౌదీ అరేబియా అప్రకటిత రాజుగా వ్యవహరిస్తున్నాడు.
సాద్ ప్రస్తుతం సౌదీ అరేబియా నుంచి పారిపోయి.. కెనడాలో ఆశ్రయం పొందుతున్నాడు. సాద్ పిల్లలు ఇద్దరు సౌదీప్రభుత్వం వద్ద బందీలుగా ఉన్నారు. తనని చంపే వరకు ఎంబీఎస్ ఊరుకోరని సాద్ సీబీఎస్ న్యూస్ ఛానెల్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశాడు.
ఇవీ చదవండి
Advertisement