CoBRA Unit: జమ్మూ కశ్మీర్‌కు తొలిసారి కోబ్రా యూనిట్‌..!

జమ్మూకశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్‌ ప్రత్యేక కమాండోలైన కోబ్రా దళాలను కూడా రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనంతనాగ్‌ ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాది మృతదేహాన్ని గుర్తించారు. 

Published : 18 Sep 2023 15:36 IST

ఇంటర్నెట్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌(Jammu and Kashmir)లో సీఆర్‌పీఎఫ్‌ అత్యున్నత దళమైన కోబ్రా యూనిట్‌ను రంగంలోకి దించుతోంది. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. వామపక్ష ఉగ్రవాదంపై పోరాడటంలో సుదీర్ఘ అనుభవం కోబ్రా యూనిట్స్‌కు సొంతం. గతంలో ఈ దళం బిహార్‌, ఝార్ఖండ్‌లో విధులు నిర్వర్తించింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో ఈ దళం ఉంది. ఏప్రిల్‌ శిక్షణ నిమిత్తం వచ్చిన వీరు ఇక్కడే కొనసాగుతున్నారు.  ఇప్పటి వరకు వీరికి ఎటువంటి బాధ్యతలు అప్పజెప్పలేదు. తాజాగా వీరిని ఇక్కడే మొహరించనున్నారు. 

అడవుల్లో ప్రత్యేకమైన గెరిల్లా యుద్ధతంత్రం కోసం కోబ్రా (ది కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిసొల్యూట్‌ యాక్షన్‌) దళాన్ని ఏర్పాటు చేశారు. వీరికి అడవుల్లో పోరాడటంలో మంచి అనుభవం ఉంది. ఈ దళ సభ్యులను శిక్షణ సమయంలోనే మానసికంగా, శారీరకంగా అత్యంత కఠినంగా తీర్చిదిద్దుతారు. ఈ దళాలు చాలా వరకు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నాయి. కొన్ని దళాలు మాత్రం ఈశాన్య భారత్‌లో వేర్పాటు వాదంపై పోరాటం చేస్తున్నాయి.  

అనంతనాగ్‌లో భారీగా గాలింపు చర్యలు..

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌(Anantnag)లో  నేడు కాల్పులు ఆగాయి. నిన్న మొత్తం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు చోటు చేసుకొన్నాయి. నిన్న భద్రతా దళాలు డ్రోన్లు ఎగరవేసి ఉగ్ర స్థావరాల వద్ద  మృతదేహాలను గుర్తించాయి. సోమవారం ఉదయం నుంచి కాల్పులు చోటు చేసుకోకపోవడంతో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించాయి. ఇది ఉగ్రస్థావరానికి అతి సమీపంలోనే ఇది పడిఉంది. 

మరోవైపు భద్రతా దళాల ప్రాణనష్టానికి తాము ప్రతీకారం తీర్చుకొంటామని జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అన్నారు. ఉగ్రనాయకులు దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. భద్రతా దళాలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. దేశం మొత్తం వారి వెంటే ఉందని మనోజ్‌ సిన్హా తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో సామాన్యూడిని అణచివేసిన ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపే సమయం ఆసన్నమైందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని